
దళితుల భూముల్లో బోర్డులు
ఆందోళనలో పెద్దబమ్మిడి దళితులు
2009 నుంచి అన్ని రకాల పత్రాలతో సాగు చేస్తున్నామని స్పష్టీకరణ
టెక్కలి: అన్ని రకాల భూమిపత్రాలతో సాగు చేస్తున్న భూములను ఇప్పటికిప్పుడు ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేసి తమను అన్యాయం చేస్తున్నారని కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికార పార్టీ నాయకుల ప్రోద్బ లంతో అధికారులు తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెద్దబమ్మిడి సర్పంచ్ మెండ తాతయ్య సహకారంతో గ్రామంలోని పోరంబోకు భూమిని సుమారు 38 మంది నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి 26 సెంట్లు చొప్పున కేటాయించారు. భూ పట్టాలతో పాటు పాస్ పుస్తకాలు, ఇతర భూపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం, ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కూడా వర్తింపజేశారు. ప్రస్తుతం ఆయా భూముల్లో వ్యవసాయం, ఇతర పంటలను పండిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా శుక్రవారం రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంతో దళితులంతా ఆందోళన చెందుతున్నారు.
కొంత మంది కూటమి నాయకుల ఒత్తిడితో మా భూముల్లో అధికారులు బోర్డులు ఏర్పా టు చేశారు. దశాబ్దాలుగా అన్ని రకాల పత్రాలతో సాగు చేస్తున్నాం. మాకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
–తోట వెంకటరమణ, బాధితుడు