
తీరంలో మృతదేహం
సంతబొమ్మాళి: పిట్టవానిపేట సముద్రతీరానికి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం కొట్టుకొచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఒకటి రెండు రోజుల కిందట సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతై ఉంటారని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
ఎచ్చెర్ల : తోటపాలెం పంచాయతీ అఖింఖాన్‌పేట శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినోద్‌కుమార్ తెలిపారు.
ఘనంగా కొత్తమ్మ తల్లి మారువారం
టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయంలో మంగళవారం మారువారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులంతా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముర్రాటలతో చల్లదనం చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.
సీ్త్ర శక్తి పథకం ద్వారా రూ.51 కోట్లు భారం
టెక్కలి: ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకం దిగ్విజయంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో నెలకు సుమారుగా రూ.51 కోట్లు భారం పడుతోందని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 6 జిల్లాల్లో 1610 బస్సులు ఉన్నాయని వాటిలో సీ్త్ర శక్తి పథకానికి 1352 బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. కొత్తగా బస్సులు పెంచే ఆలోచన ప్రభుత్వ విధానం పై ఆధారపడి ఉంటుందని ఈడీ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఒక సారి రద్దయిన బస్సులను మళ్లీ పునరుద్ధరణ చేయడం కష్టతరమన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లను బీఓటీ పద్ధతి ద్వారా ఆధునీ కరణ చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఈడీ పేర్కొన్నారు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఫిట్టర్ తదితర కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఈడీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి 154 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రమాదంలో మరణిస్తే రూ.1.10 కోట్ల పరిహారం అందజేస్తామ ని, సాధారణంగా మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని వెల్లడించారు. ఆయనతో పాటు డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, డీఈ రవికుమార్, డీఎం ఎం.శ్రీనివాస్ ఉన్నారు.
7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు కె.భానుమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం ఎన్‌జీఓ భవన్‌లో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం, మెరుగైన పీఆర్‌సీ, మధ్యంతర భృతి మంజూరు, మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు కాలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏటా రూ.180 కోట్లు హెల్త్‌కార్డుల కోసం చెల్లిస్తున్నా ఆస్పత్రులు అంగీకరించడం లేదన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, అంతర్ జిల్లా బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్‌కుమార్, కార్యవర్గ సభ్యులు జి.రమణ బి.వెంకటేశ్వర్లు వి.సత్యనారాయణ, కుప్పిలి జగన్మోహన్, చావలి శ్రీనివాస్, వి.నవీన్‌కుమార్, వి.రామారావు, పి.హరిప్రసన్న, టి.శ్రీనివాసరావు, డి.రామ్మోహన్ డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తీరంలో మృతదేహం

తీరంలో మృతదేహం