
జి.సిగడాం: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జి.సిగడాం మండలం ఆనందపురం –వాండ్రంగి గ్రామాల మధ్య వంతెన సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం ఇల్లయ్యగారిపేట గ్రామానికి చెందిన కొంచాడ యశ్వంత్‌కుమార్(15), గారపేటకు చెందిన కెల్ల వెంకటేష్ బైక్‌పై దవళపేటలోని స్నేహితుడి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వెనుక నుంచి లగేజ్ వ్యాన్ ఢీకొనడంతో యశ్వంత్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్‌కు తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళం తరలించారు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రైవేటు బస్సు ఢీకొని..
మెళియాపుట్టి : బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. చాపర గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నాగవంశపు లక్ష్మణరావు(39) నడిచి వెళ్తుండగా ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణరావుకు భార్య కల్పన, ముగ్గు రు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనం ఢీకొని..
శ్రీకాకుళం రూరల్: పెదపాడు ప్రధాన రహదారిలో పద్మావతి కల్యాణ మండపం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. బొట్ట సూర్యనారాయణ (75) స్థానిక పద్మావతి కల్యాణ మండపంలో నైట్ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధుల్లో చేరేందుకు రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుంచి పెదపాడు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సూర్యనారాయణ భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.