
‘మరో థర్మల్ కేంద్రం మాకొద్దు’
శ్రీకాకుళం: జిల్లాలో గత కొన్నేళ్లుగా కాలుష్యకారకమైన థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రతిపాదించడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ చౌదరి లక్ష్మణ రావు అన్నారు. సరుబుజ్జిలి మండలంలోని గిరిజన గ్రామం వెన్నెలవలస వద్ద 3200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం, ఆమదాలవలసల్లో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రంతో ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను తక్షణం నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశా రు. కరపత్రాల ద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల ప్రకృతికి, మానవాళికి జరిగే అనర్థాలను వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ఊసే లేదన్నారు. పర్యావరణ అనుకూలమైన ప్ర త్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు.