
నేటి నుంచే కిరణ దర్శనం
● ఆదిత్యాలయంలో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు
● రేపు కూడా దర్శనానికి చర్యలు
అరసవల్లి: ఆదిత్య క్షేత్రంలోని సూర్యభగవానుడిపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుతానికి సమయం ఆసన్నమైంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా ఉత్తరాయణ దక్షిణాయణ కాలమార్పుల్లో సంభవించే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వందలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. ఈ మేరకు బుధవా రం వేకువజాము సూర్యోదయ కాలాన తొలి సూర్యకిరణాలు ఆలయ రాజగోపుర ప్రాకారం నుంచి అనివెట్టి మండపం గుండా నేరుగా గ ర్భాలయంలోని స్వామి మూలవిరాట్టును తాకనున్నాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు మంగళవారం సాయంత్రానికే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు అరసవల్లి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ మేరకు భక్తులకు కిరణదర్శనానికి ప్రత్యేకంగా ధ్వజస్తంభం నుంచి బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. సూర్యోదయ సమయా న వాతావరణం అనుకూలిస్తే కచ్చితంగా బుధ, గురువారాల్లో సూర్యకిరణాల కాంతులు స్వామి మూలవిరాట్టుపై దర్శనమిస్తాయని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ వివరించారు.
విద్యార్థి విజ్ఞాన్ మంతన్ రిజిస్ట్రేషన్స్ గడువు పొడిగింపు
శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియం, భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా లార్జెస్ట్ ఆన్‌లైన్ సైన్స్ టా లెంట్ టెస్ట్ విద్యార్థి విజ్ఞాన్ మంతన్ 25–26, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే కార్యక్రమం అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు వీవీఎం జిల్లా కోఆర్డినేటర్ ఎ.పున్నయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ రాష్ట్రాల పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకు ప్రకృతి వైపరీత్యాలు, అర్ధ సంవత్సర పరీక్షలు, పండగలు దృష్ట్యా పొడిగించామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మాక్ టెస్ట్ అక్టోబర్ 15 వరకు ఉంటుందని తెలియజేశారు.
దుర్గా దేవిగా నీలమణిదుర్గమ్మ
పాతపట్నం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారు దుర్గా దేవిగా పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆవరణలోని యోగశాలలో దేవతా హోమాలు, అమ్మవారి మూలమంత్ర హోమాలను నిర్వహించారు.