
పెరుగుతున్న చైతన్యం
స్వచ్ఛంద రక్తదానం..
● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు ● ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైనం ● నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం
శ్రీకాకుళం కల్చరల్ :
రక్తదానంపై చైతన్యం పెరుగుతోంది. అపోహలు, వివిధ కారణాల వల్ల ఒకప్పుడు శిబిరాలు ఏర్పాటు చేసి బతిమాలితే గానీ రక్తదానానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్వచ్ఛందంగా బ్లడ్‌బ్యాంకులు, శిబిరాలకు వెళ్లి రక్తదానం చేసేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతోమందికి పునర్జన్మ లభిస్తోంది. భారత ప్రభుత్వం ఏటా అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం (నేషనల్ వలంటరీ బ్లడ్ డోనర్స్ డే) నిర్వహిస్తోంది.
రక్త నిల్వ కేంద్రాలు..
రక్తాన్ని సేకరించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకు(రక్త నిల్వ కేంద్రాలు)లు అందుబాటులో ఉన్నాయి. ఏర్పాటు చేశారు. సేకరించిన ఇక్కడ నిల్వచేసి అవసరమైన వారికి అందిస్తుంటారు. జిల్లాలో అతి పెద్ద రక్తనిల్వ కేంద్రంగా శ్రీకాకుళం రెడ్‌క్రాస్ నిలుస్తోంది. ఇక్కడి నుంచి జిల్లా కేంద్రంలో రిమ్స్‌కు, పాతపట్నం, టెక్కలి, పాలకొండల ప్రభుత్వ ఆసుపత్రులకు రక్తాన్ని అందిస్తున్నారు. తలసేమియా, సికిల్‌సేమియా, హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. దీంతో పాటు ప్లేట్‌లెట్స్, ఎఫ్‌ఎఫ్‌పీ కూడా సేకరించి అందిస్తున్నారు. ఎస్‌డీపీ ద్వారా కూడా రక్తసేకరణ చేస్తున్నారు.
అపోహలు వీడాలి..
చాలా మందికి రక్తదానం అంటే భయం, అపోహలు ఉన్నాయి. రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మి.లీ. రక్తం మాత్రమే స్వీకరిస్తారు. సాధారణంగా మనిషిలో సరాసరి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో 300 మి.లీ.రక్తం దానం చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. 18 నుంచి 60 ఏళ్లు కలిగిన ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. బీపీ, షుగర్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రక్తదానానికి దూరంగా ఉండటం మంచిది. జిల్లా జనాభాతో పోల్చితే రక్తదాతలు కేవలం ఒక్క శాతం మాత్రమే. అవసరం మాత్రం అంతకుమించి ఉంది. జిల్లా అవసరాలకు సరిపడా రక్తం సేకరణ జరగడంలేదనే చెప్పాలి.

పెరుగుతున్న చైతన్యం