
25 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
పలాస : పలాస రైల్వేస్టేషన్ మార్గంలో 25 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఒడిశాలో కొనుగోలు చేసిన 10 కిలోల గంజాయిని పలాస రైల్వేస్టేషన్ మీదుగా కోల్‌కతాకు రవాణా చేసేందుకు వెళ్తుండగా పర్లాకిమిడికి చెందిన సర్వశుద్ది కుమార్ స్వామిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో.. గజపతి జిల్లా జలంతర్సింగ్ గ్రామానికి చెందిన రాజేష్‌బెరా ఒడిశాలో కొనుగోలు చేసిన 15 కిలోల గంజాయిని తెలంగాణాకు రైలు ద్వారా అక్రమ రవాణా చేసేందుకు పలాస రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.