
గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం
శ్రీకాకుళం పాతస్టాండ్: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, వర్కర్లు, డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా అవసరమని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డితో కలిసి నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కళాశాలల్లో తక్షణమే ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత సమాజంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగాలని సూచించారు. ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి అరికట్టడంలో కేసులు పెట్టడం మాత్రమే లక్ష్యం కాదని, ఒకే వ్యక్తి పదేపదే వాడుతున్నాడంటే నిఘా లోపం ఉన్నట్టేనని పేర్కొన్నారు. చిన్న సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు గానీ, 112 లేదా 1930 నంబర్లకు గానీ తెలియజేయాలని కోరారు. 2025 జులై–ఆగస్టు నెలల్లో 350.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 77 మందిని అరెస్ట్ చేసి, 8 వాహనాలను సీజ్ చేసినట్టు వివరించారు.
మహిళా భద్రతకు అమలు చేస్తున్న ‘నారీ శక్తి’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. అనంతరం రహదారుల భద్రతపై సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 524 రహదారి ప్రమాదాలు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, పోలీస్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా, వైద్య ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్, రవాణా శాఖల అధికారులు హాజరయ్యారు.