
హార్డ్‌వేర్ షాపు దగ్ధం
కొత్తూరు : కొత్తూరులోని బత్తిలి రోడ్డులో ఇరాజీ కిమారామ్‌కు చెందిన కమల హార్డ్‌వేర్ షాపులో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని కొత్తూరు అగ్ని ప్రమాక కేంద్రానికి సమాచారం అందించారు. ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ శంకరరావు సిబ్బందితో వచ్చి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంజిన్ మోటార్ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. విషయాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహన్‌రావుకు తెలియజేయడంతో వెంటనే పాలకొండ, ఆమదాలవలస అగ్నిమాపక కేంద్రాల ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హార్డ్‌వేర్‌షాపుతో పాటు పక్కనే ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ మందులు షాపులోకి మంటలు చెలరేగడంతో అక్కడ కూడా సుమారు రూ.ఏడు లక్షల విలువైన మందులు పాడయ్యాయి. జిల్లా అగ్నిమాపక అధికారి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు.
కొత్తూరులో వేకువజామున ఘటన
సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం
మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసిన సిబ్బంది

హార్డ్‌వేర్ షాపు దగ్ధం