
ఇద్దరు గొలుసు దొంగల అరెస్టు
సోంపేట : కొర్లాం జాతీయ రహదారి వద్ద సెప్టెంబరు 14న చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరిని బారువ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ బి.మంగరాజు, బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కవిటి మండలం దూగానపుట్టుగకు చెందిన దంపతులు ఎంపలి కృష్ణ, జానకి మందస మండలంలో తన అల్లుడి వద్దకు దసరా పిలుపుకు బయలుదేరారు. కొర్లాం జాతీయ రహదారి వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరిని కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు దారి చూపించమని అడిగారు. దీంతో కృష్ణ బైక్‌ను నెమ్మది చేశారు. ఈ సమయంలో కృష్ణ భార్య ధరించిన 42 గ్రాముల బంగారు చైన్ తెంచుకుని పలాస వైపు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా అనుమానించారు. కేసు దర్యాప్తు చేస్తుండగా మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వెంబడించి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మురళి శెట్టి, రంజన్ సాహులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా కొర్లాంలో జరిగిన చైన్‌స్నాచింగ్‌ను ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సోంపేట సీఐ, బారువ ఎస్‌ఐలకు ఎస్పీ అభినందించారు.