
సచివాలయ ఉద్యోగుల చలో కలెక్టరేట్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం సచివాలయం ఉద్యోగులు చలో కలెక్టరేట్ నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ వసతి గృహం రోడ్డుపై రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్ల బకాయిలు చెల్లించాలని, తొమ్మిది నెలల ఎరియర్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్ల పనులు కూడా ఉద్యోగులతో చేయించడం ఆపాలని, గ్రామ స్థాయిలో నాయకుల నుంచి వేధింపులు అరికట్టాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి బి.జగదీష్‌బాబు, పి.నారాయణ రావు, ఎం.రవికుమార్, వెంకటేశ్వర్లు, సంగయ్య, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.