
బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచుదాం
శ్రీకాకుళం రూరల్: భావితరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందిద్దామని, సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచుదామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రత దినోత్సవం శనివారం నిర్వహించారు. పెదగనగళ్లవానిపేట బీచ్ పరిసర ప్రాంతంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి చెత్తాచెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీచ్‌కు వచ్చిన వారు సైతం తమవెంట చిన్నపాటి డస్ట్‌బిన్‌ను తీసుకురావాలన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కింద జిల్లాలో ఇప్పటికే 912 గ్రామాలకు గాను 221 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వ్యర్థాలు సముద్రంలోకి నేరుగా విడిచిపెట్టడం వల్ల నీరు కలుషితమవుతోందన్నారు. మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు చెప్పారు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, డీపీఓ కె.భారతి సౌజన్య, తహశీల్దార్ గణపతిరావు, ఎంపీడీఓ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.