
బంగారం కోసమే బలిగొన్నారా?
● వీడిన నరసన్నపేట వ్యాపారి అదృశ్యం మిస్టరీ
● పెదపాడు రామిగెడ్డలో లభ్యమైన మృతదేహం
● పోలీసుల అదుపులో నిందితులు!
శ్రీకాకుళం రూరల్: నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా(45) అదృశ్యం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని పెదపాడు వద్ద రామిగెడ్డలో శుక్రవారం ఉదయం 11 గంటలకు గుప్తా మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి..
నరసన్నపేటకు చెందిన గుప్తా బంగారాన్ని హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తూ నరసన్నపేటతో పాటు శ్రీకాకుళంలోని పలు షాపులకు విక్రయించేవారు. ఈయన వద్ద డ్రైవర్ సంతోష్ ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. గుప్తా వద్ద బంగారం కాజేయాలనే ఉద్దేశంతో సంతోష్ తన స్నేహితుడు కార్ డెకార్స్ యజమాని రాజుతో కలిసి ప్లాన్ వేశాడు.
ఆ రోజు ఏం జరిగిందంటే..
ఆగస్టు 26న విశాఖపట్నంలోని ఓ బంగారం దుకాణం వద్ద కేజీన్నర బంగారాన్ని గుప్తా కొనుగోలు చేశారు. విశాఖపట్నం నుంచి తన కారులో బంగారాన్ని తీసుకొస్తుండగా శ్రీకాకుళంలోకి రాగానే డ్రైవర్ సంతోష్‌తో పాటు ఆదిత్య డెకార్స్ యజమాని రాజు కలిసి పెదపాడు వద్ద కారుషెడ్‌లోనే దారుణంగా హత్య చేశారు. ఆగస్టు 26 నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడం, కాలువలు, గెడ్డలు గుండా పెదపాడు పరిసర ప్రాంతమంతా అత్యధికంగా నీటి ప్రవాహం ఉండటంతో మృతదేహాన్ని పాత్రునివలస రామిగెడ్డలో పడేశారు. అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి గుర్రపుడెక్కల మధ్యలో మృతదేహం చిక్కుకుపోయింది. గుప్తా వద్ద దోచుకున్న బంగారంలో సంతోష్, రాజులు ఒకరు 60శాతం, మరొకరు 40శాతం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అదృశ్యం ఫిర్యాదుతో..
గుప్తా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు నరసన్నపేట పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మృతిచెంది ఉండవచ్చనే సమాచారం మేరకు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, క్రైం పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి సీఐలు పైడపునాయుడు, శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాము చేరుకుని మృతదేహన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
పోలీసుల అదుపులో నిందితులు!
గుప్తాను హత్యచేసిన ఉదంతంలో నరసన్నపేట పోలీసులు డ్రైవర్ సంతోష్, కారు డెకార్స్ యజమాని రాజును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నమే పెదపాడులోని కారు డెకార్స్‌ను నరసన్నపేట, శ్రీకాకుళం పోలీసులు పరిశీలించారు. హత్య ఎలా చేశారు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా, కార్ డెకార్స్ యజమాని ఓ టీడీపీ నాయకుడికి దగ్గర బంధువని సమాచారం.

బంగారం కోసమే బలిగొన్నారా?