
వైద్య విద్యపై ప్రభుత్వం కుట్రలు
● ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలు
● యూరియా కోసం రైతుల తిప్పలు కనిపించడం లేదా..?
● మాజీ స్పీకర్ తమ్మినేని మండిపాటు
టెక్కలి: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల కలలను నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శనివారం టెక్కలి పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలు ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుపేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే, వాటిలో 10 కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. కొత్త వైద్య కళాశాలల కోసం ఇతర రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే, మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లును రద్దు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మరోవైపు యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులు పడుతున్న కష్టాలపై ఈనెల 9న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు అర్థ రహితం
యూరియా కోసం రైతులు అవస్థలు పడుతుంటే, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని పేరాడ తిలక్ మండిపడ్డారు. భోజనాల కోసం ప్లేట్లు పట్టుకుని నిల్చున్నపుడు.. యూరియా కోసం క్యూలో నిలబడలేరా అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. 15 నెలల కూటమి పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. సమావేశంలో టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, పార్టీ మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్‌రాజు, బి.మోహన్‌రెడ్డి, టి.పాల్గుణరావు, నాయకులు సత్తారు సత్యం, టి.కిరణ్, అన్నెపు రామారావు, కె.బాలకృష్ణారావు, ఆర్.మల్లయ్య, జి.గురునాథ్‌యాదవ్, ఎం.అప్పారావు, యర్ర చక్రవర్తి, చిన్ని జోగారావు, కెల్లి గోవింద్, డి.రామకృష్ణారెడ్డి, పి.వెంకట్రావు, కె.అజయ్, పి.రమేష్, ఎన్.భీమారావు తదితరులు పాల్గొన్నారు.