
మఠం భూములు హాంఫట్..!
● బావాజీ మఠం భూముల కబ్జా
● ఆక్రమణదారుల చేతుల్లోకి రూ.కోట్లు విలువైన భూములు
● అక్రమ లే అవుట్లకు అడ్డగోలు అనుమతులు
ఇటీవల కబ్జా చేసిన స్థలం చదును చేసిన దృశ్యం
ఆమదాలవలస రూరల్: ఆక్రమించుకునే అవకాశమే ఉండాలి గానీ.. ఆకాశాన్ని కూడా వదలరు ఇక్కడి అక్రమార్కులు. వీరి కన్నుపడితే ఎటువంటి భూములైనా మటాస్ కావాల్సిందే. దేవుడి భూములైనా.. ప్రభుత్వ బంజరు భూములైనా అన్యాక్రాంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దర్జాగా దురాక్రమణ చేయడమే కాదు.. అనధికార లే అవుట్లు వేయడంలోనూ ముందుంటారు. మహా నగరాలకు తీసిపోనివిధంగా భవంతుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆమదాలవలస రూరల్ మండలంలో కబ్జారాయుళ్ల దర్జా ఇది. ఇటీవల తోటాడ గ్రామంలో బావాజీ మఠం భూముల ఆక్రమణలే ఇందుకు నిదర్శనం.
ఆగని ఆక్రమణల పర్వం
గత కొంతకాలం నుంచి ఆమదాలవలస మండలం తోటాడ గ్రామంలో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికారుల కళ్లెదుటే ఈ కబ్జాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. సర్వే నంబర్ 121లో 199.48 ఎకరాల బావాజీ మఠం భూములు దర్జాగా కబ్జా చేశారు. కొందరు కూటమి నాయకుల అండతో అక్కడ భూదందా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒడిశాకు చెందిన మఠం యజమానులు ఇక్కడ నుంచి వెళ్లిపోవటంతో పాటు వారి వారసులు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. దీంతో కబ్జాదారులు ఈ భూములు ఆక్రమించుకొని వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే జాతీయ రహదారికి ఆనుకొని కొత్తరోడ్డు వద్ద ఉన్నటువంటి మఠం భూములను సైతం ఆక్రమించారు.
అధికారుల చేతివాటం
ఇకపోతే ఆక్రమణదారుల అక్రమ లేఅవుట్లకు అనుమతులు అందించడంలో అధికారులు చేతివాటం చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి ఏదైనా లే అవుట్‌కు అనుమతి పొందాలంటే అందుకు సంబంధించిన భూపత్రాలు ఉండాలి. అయితే ఇతరులు భూములకు సంబంధించి అక్రమ లే అవుట్లకు అనుమతులు మంజూరు చేశారంటే దీని వెనుక ఎంత చేతివాటం ఉందో అన్న విషయం అర్థమవుతోంది.
అక్రమ రిజిస్ట్రేషన్లు
వాస్తవంగా మఠం భూములకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేసే అధికారం లేదు. అయితే సంబంధం లేని సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సహకరిస్తున్నారని పలువురు మాట్లాడుకుంటున్నారు. అలాగే మఠం భూముల్లో వ్యాపార భవనాలు గానీ, అపార్ట్‌మెంట్లు గానీ నిర్మిస్తే విద్యుత్ సదుపాయం అందించకూడదు. కానీ విద్యుత్ శాఖ అధికారులు అధిక మొత్తంలో అక్రమార్జనకు పాల్పడి అడ్డగోలుగా ట్రాన్‌ఫార్మర్లు, మీటర్లు అందించినట్లు తెలుస్తోంది.
జోరందుకుంటున్న నిర్మాణాలు
ఈ స్థలంలో మహా నగరాలను తలపించేవిధంగా అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఆక్రమణదారులు ఇతరులకు విక్రయించేందుకు కొందరు అపార్ట్‌మెంట్ నిర్మాణ గుత్తేదారులకు ఈ స్థలం అప్పగిస్తున్నారు. అంతేకాకుండా కొనుగోలుదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా అందించడం విశేషం. ఏది ఏమైనా వందల ఎకరాల స్థలాన్ని ఆక్రమణదారులు యథేచ్ఛగా దోచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి ఈ కబ్జాలకు అడ్డుకట్టు వేయకపోతే మరిన్ని భూములు మాయమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మఠం భూములు హాంఫట్..!