దివ్యాంగులకు దర్శన కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు దర్శన కష్టాలు!

Sep 6 2025 4:37 AM | Updated on Sep 6 2025 4:39 AM

● ఆదిత్యుని సన్నిధిలో కానరాని ‘ప్రత్యేక’ ఏర్పాట్లు

● ఆలయ స్థాయి పెరిగినా తీరు మారని వైనం

వీల్‌చైర్లను వినియోగిస్తున్నాం..

దివ్యాంగుల దర్శనాలకు ప్రస్తుతానికి వీల్‌చైర్లను వినియోగించి దర్శనాలకు పంపుతున్నాం. రద్దీ సమయాల్లో వీఐపీ మార్గంలోనే పంపిస్తున్నాం. ఇప్పటివరకు శాశ్వత మరుగుదొడ్లు, అన్నదాన మండపాలేవీ నిర్మాణాలు కాలేదు. భవిష్యత్‌ నిర్మాణాల్లో కచ్చితంగా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లతోనే కొత్త నిర్మాణాలు చేపడతాం. స్టాఫ్‌ లేకపోవడంతో ప్రత్యేక సిబ్బంది కేటాయింపు సమస్యగా మారింది. – కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌,

ఆలయ ఈవో, అరసవల్లి

అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు కొలువుదీరిన అరసవల్లిలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన దివ్యాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక ఏర్పాట్లు కానరాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజులను పక్కన పెడితే ఆదివారం ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో దివ్యాంగులు క్యూలైన్ల వద్ద నరకయాతన అనుభవిస్తున్నారు. ఇనుప గ్రిల్స్‌కు ఆనించుకుని నిలబడి కృత్తిమ కాలు (ఆర్టిఫిషియల్‌ లెగ్‌)ను అమర్చుకోవడంతో పాటు కేశఖండన శాలలో తలనీలాలను తీయించుకున్న తర్వాత పైపుల వద్ద నిల్చుని స్నానాలకు ఆగచాట్లు పడుతున్నారు. మరుగుదొడ్లలో కూడా దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం ముందు వరకు వెళ్తే మాత్రం నాలుగైదు వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో ఆదిత్యుని మహామండపం వరకు మాత్రమే వెళ్లేదుకు అనుమతిస్తున్నారు. దీంతో దూరం నుంచే ఆదిత్యున్ని దర్శించుకుని వెనుదిరగాల్సి వస్తుంది. ఆదిత్యుని ఆలయానికి వార్షిక ఆదాయం రూ.20 కోట్ల వరకు చేరడంతో డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) హోదా పొందిన సంగతి విదితమే. అయినప్పటికీ అంతటి స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేయాలి..

ఆదిత్యాలయానికి దివ్యాంగులు దర్శనాలకు అధికంగా వస్తున్నారు. వీరికి ఆలయంలో తగిన ఏర్పాట్లు లేకపోవడంతో దూరం నుంచి దర్శనం చేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది మినహా మరే ఇతర ఆర్జిత సేవల్లోనూ పాల్గొనే అవకాశాలు లేకుండాపోతున్నాయనే ఆవేదన దివ్యాంగుల్లో వ్యక్తమవుతోంది. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలకు, కళ్యాణ సేవలకు, తలనీలాల మొక్కులు చెల్లింపులకు, అన్నప్రసాదాల స్వీకరణకు కూడా ఎలాంటి ‘ప్రత్యేక’ ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఆలయ అధికారులు, పాలకులు దృష్టి సారించి దివ్యాంగులకు ‘ప్రత్యేక’ దర్శనం కల్పించాలని కోరుతున్నారు.

● కాళ్లు, చేతులు కోల్పోయిన వారు, అంధత్వమున్న దివ్యాంగులకు ప్రత్యేక దర్శన మార్గం (క్యూలైన్లు) ఏర్పాటు చేయాలి.

● దివ్యాంగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలి. స్నానాల గదులతో పాటు కింద అంతస్థులోనే వసతి ఉండేలా చూడాలి.

● ఇంద్రపుష్కరిణి సమీపంలోనే తలనీలాల మొక్కులు చెల్లించుకునేందుకు..అక్కడికి సమీపంలోనే దివ్యాంగులు స్నానాలకు వీలుగా తక్కువ ఎత్తులో పైపులైన్లు ఏర్పాట్లు చేయాలి.

● దర్శనానికి వచ్చే మార్గంలో దివ్యాంగులు వచ్చే వాహనాలకు అనుమతివ్వడంతో పాటు ప్రత్యేకంగా ఆలయ సిబ్బందిని కనీసం ఆదివారం నాడైనా డెప్యూట్‌ చేయాలి.

● ఆర్జిత సేవల్లో దివ్యాంగులు పాల్గొనేలా సౌకర్యాలు కల్పించాలి. కనీసం గంట సమయం పట్టే సూర్యనమస్కారాల పూజల్లో పాల్గొనేందుకు వీలైన సౌకర్యాలు కల్పించాలి.

● ఉదయం ఆలయంలో ఉచిత ప్రసాదాల స్వీకరణకు, మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని తీసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి.

దివ్యాంగులకు దర్శన కష్టాలు! 1
1/2

దివ్యాంగులకు దర్శన కష్టాలు!

దివ్యాంగులకు దర్శన కష్టాలు! 2
2/2

దివ్యాంగులకు దర్శన కష్టాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement