
కార్పొరేట్ గుప్పిట్లో మెడికల్ కాలేజీలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మెడికల్ కాలేజీలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ కళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందులో పది కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల సుమారు 1500 మెడికల్ సీట్లు కోల్పోయే దుస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో విలేజ్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్, 3256 రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఆసరాగా నిలిచారని గుర్తు చేశారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అప్రజాస్వామికం
శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన విధానం మేరకు ప్రతి ఇంట్లో ఒకరు డాక్టర్ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదే పరంపర కొనసాగిస్తూ 2019లో ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మెడికల్ విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రిమ్స్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఎస్.అప్పలనాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మశ్రీ నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పలనాయుడు గతంలో విజయనగరంలో ప్రొఫె సర్‌గా సేవలందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో సమావేశమై కళాశాల వివరాలను తెలుసుకున్నారు.
ఎఫ్‌డీఓకు పదోన్నతి
అరసవల్లి: జిల్లా మత్స్యశాఖలోని ఫిష్ సీడ్ ఫామ్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎఫ్‌డీవో)గా విధులు నిర్వర్తిస్తున్న డి.గోపికృష్ణకు విజయవాడ కమిషనరేట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎఫ్‌డీవోగా సేవలందించిన గోపీకృష్ణకు పదోన్నతి లభించడంపై సిబ్బంది, మత్స్యకారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.
వాస్తవికతకు దగ్గరగా ‘కన్యాకుమారి’
శ్రీకాకుళం అర్బన్: ఉత్తరాంధ్ర వాస్తవికతకు దగ్గరగా కన్యాకుమారి చిత్రం రూపొందించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఓ హోటల్లో శుక్రవారం ‘కన్యాకుమారి’ చిత్రం సక్సెస్ మీట్‌ను చిత్ర నిర్మాతల్లో ఒకరైన అట్టాడ అప్పలనాయుడు నిర్వహించారు. చిత్రనటులు అగ్గున బాబూరావు, జ్యోతి బత్తుల, గిరిజ శంకర్, తిరుమలరావు, సాహితీవేత్తలు కె.శ్రీనివాస్, ఉదయ్‌కిరణ్, న్యాయవాది మామిడి క్రాంతి, దాసరి రామచంద్రరావు, డాక్టర్ సతీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం యాస, సంస్కృతి, రైతును హీరోగా చూపడం చిత్రం గొప్పతనమన్నారు. చిత్ర దర్శకుడు అట్టాడ సృజన్‌కు మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీల్లోనూ రిలీజ్ అవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాన కృష్ణచంద్, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ గుప్పిట్లో మెడికల్ కాలేజీలు

కార్పొరేట్ గుప్పిట్లో మెడికల్ కాలేజీలు

కార్పొరేట్ గుప్పిట్లో మెడికల్ కాలేజీలు

కార్పొరేట్ గుప్పిట్లో మెడికల్ కాలేజీలు