
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ శాఖల కార్మిక రంగ సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ భవన్‌లో జిల్లా చైర్మన్ ఎస్.శ్రీరాములు అధ్యక్షతన జిల్లా ప్రధాన కార్యదర్శి సీపాన వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిల వివరాలను పే స్లిప్పులు, సీఎఫ్‌ఎంఎస్‌లో చూపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్‌సీ కమిషన్ నియమించాలని కోరారు. గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అర్లయ్య, క్లాస్–4 ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మల్లేశ్వరరావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా మహిళా విభాగం చైర్‌పర్సన్ కె.ప్రవళ్లిక ప్రియ, పొదిలాపు శ్రీను, వీవీఎన్ రాజు, సీపాన గోవిందరావు, జల్లేపల్లి రామారావు, ఎం.కాళీప్రసాద్ పాల్గొన్నారు.
డివిజన్ కమిటీల నియామకం..
ఏపీజేఏసీ అమరావతి సంఘం డివిజన్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాకుళం డివిజన్ చైర్మన్‌గా ఎస్.గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా పి.రాజశేఖర్, టెక్కలి డివిజన్ చైర్మన్‌గా బి.హేమసుందర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రావు, పలాస డివిజన్ చైర్మన్‌గా బి.అప్పలస్వామి, ప్రధాన కార్యదర్శిగా పి.కుమార్, మహిళా విభాగం శ్రీకాకుళం సిటీ యూనిట్ చైర్‌పర్సన్‌గా డి.అనురాధ, ప్రధాన కార్యదర్శిగా బి.సుభద్ర, శ్రీకాకుళం డివిజన్ చైర్మన్‌గా డి.వనజాక్షీ, ప్రధాన కార్యదర్శిగా పి.రాజేశ్వరి, టెక్కలి డివిజన్ చైర్మన్‌గా ఎస్.పవిత్ర, ప్రధాన కార్యదర్శిగా ఎన్.అనూష, పలాస డివిజన్ చైర్మన్‌గా ఎస్.కరుణమ్మ, ప్రధాన కార్యదర్శిగా బి.ఎస్.రాణిలను ఎన్నుకున్నారు.