
రేపటి నుంచి గ్రామసభలు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ–4 కార్యక్రమం విజయవంతం చేయా లని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర విజన్–2047లో భాగంగా జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన శిక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం కన్సల్టెంట్ బి.బలరాం బంగారు కు టుంబాల ఎంపిక, దత్తత విధానాలపై అధికారులకు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 75,566 బంగారు కుటుంబాల్లో కేవలం 9,494 కుటుంబాలు మాత్రమే దత్తతకు ఎంపికయ్యాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి దత్తత ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. బంగారు కుటుంబాల తుది జాబితా తయారీకి జూలై 18 నుంచి 25లోగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘రూట్స్‘ యాప్ ద్వారా ప్రజల నుంచి వివరాలను సేకరించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పథ్విరాజ్ కుమార్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
బీఈడీ నాలుగో సెమిస్టర్‌కు నోటిఫికేషన్ విడుదల
ఎచ్చెర్ల: బీఈడీ 4వ సెమిస్టర్‌కు సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను డీన్ ఉదయ భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఆగస్టు 19 నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయని, 12లోగా ఫీజులు చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలన్నారు.
‘హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేయాలి’
టెక్కలి: హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మినేని చందనరావు డిమాండ్ చేశారు. బుధవారం టెక్కలి హైస్కూల్ ప్లస్ పాఠశాలను సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో పీజీటీ పోస్టులు ఖాళీలు ఏర్పడుతున్నాయని, తక్షణమే వాటిని ప్రభుత్వం భర్తీ చేయాలన్నారు. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల అభద్రతా భావానికి గురవుతున్నారని అన్నారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ సెక్రటరీ కె.కోదండరామిరెడ్డి, కేవీ రమణ, శ్రీధర్, మోహనరావు, అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
బోధనేతర పనుల నుంచి విముక్తి ఎప్పుడు?
శ్రీకాకుళం న్యూకాలనీ: బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ కోరా రు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాల మూతవేతే లక్ష్యంగా పాలకులు ముందుకు సాగుతుండటం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులను తరగతులకు దూరం చేస్తూ అనునిత్యం బోధన అభ్యసనకు ఆటంకం కలిగించే కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహిస్తుండటం ఇటీవల పరిపాటిగా మారిందన్నారు. బడుగు బలహీన వర్గా ల పిల్లలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఉపాధ్యాయుడిని బోధనకు దూరం చేసి.. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా చేయడం గతంలో ఎన్నడూ లేదని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తాజాగా జరిగిన మెగా పేరెంట్ సమావేశమని గుర్తుచేశారు. సమావేశం ముగిసి వారం రోజులు కావస్తున్నా.. ఆనాటి వీడియోలు, ఫొటోలు మరోసారి అప్‌లోడ్ చేయండంటూ వేధిస్తుండటం బాధాకరమన్నారు. హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లపై, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తూనే ఉండటంతో బోధన సరిగ్గా సాగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ హంగామాలోపడి విద్యా మిత్ర కిట్లు అందజేయడంలో కూడా అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. తరగతి గదిలో ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఉండేలా స్వేచ్ఛాపూరిత వాతావరణం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రేపటి నుంచి గ్రామసభలు: కలెక్టర్