
నిందితులకు స్వేచ్ఛ
●ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ●రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా..
ఈ చిత్రం చూడండి. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో పట్టపగలు ఈ నెల 11న వైఎస్సార్‌సీపీ నాయకుడు సత్తారు గోపిని హత్య చేయడంతో మృతదేహంపై పడి వారి కుటుంబీకులు పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన దృశ్యమిది. గతేడాది కూన ప్రసాద్ హత్య జరిగినప్పుడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే ఈ హత్య జరిగేది కాదని, ఎస్‌ఐ సందీప్ తీరుపై కూడా మండిపడ్డారు. మృతదేహం దగ్గరకు ఎస్పీని సైతం బాధిత కుటుంబీకులు దగ్గరకు రానీయలేదు. రోడ్డుపై నిరసన తెలియజేసి జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. దీన్నిబట్టి వారికెంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఘటన జరిగి వారం కావస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదు. 12 మందిపై లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చినా చర్యలు కన్పించలేదు. పోలీసుల తాత్సారంతో చివరికీ హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తకోట అమ్మినాయుడు కొన్ని రోజులు ఊరిలోనే తిరిగి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎప్పుడైతే ఘటనను సీరియస్‌గా తీసుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశారో వెంటనే పరారైపోయారు.
● విస్మయం కలిగిస్తున్న పోలీసుల
వ్యవహార శైలి
● ఒక్కో కేసులో ఒక్కో తీరు
● కాశీబుగ్గలో గొడవకు సంబంధం లేని ముగ్గురిపై కేసు నమోదు
● రాత్రికి రాత్రే పోలీసు స్టేషన్‌కు
తీసుకొచ్చి ఉంచిన పరిస్థితి
● ఫరీదుపేటలో హత్య జరిగినా
నిందితులపై కానరాని చర్యలు
● తాత్సారం చేయడంతో కీలక సూత్రధారి పరారీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ఈ రెండు ఘటనలను ఒక్కసారి పోల్చిచూస్తే.. కాశీబుగ్గలో గొడవకు సంబంధం లేని వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురిపై టీడీపీ వారు ఫిర్యాదు చేశారని రాత్రికి రాత్రి ఇంటి నుంచి తీసుకొచ్చి పోలీసు స్టేషన్‌లో పెట్టేశారు. అదే ఫరీదుపేటలో సత్తారు గోపి హత్య చేసిన ఘటనకు సంబంధించి వారిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఇంతవరకు అరెస్టు చేయలేదు. కాశీబుగ్గలో జరిగిన గొడవలో నిజంగా వైఎస్సార్‌సీపీ వారికి సంబంధం ఉంటే రాత్రికిరాత్రి ఇంటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆధారాలుంటే మరుసటి రోజైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ పనిచేయకుండా యుద్ధ ప్రాతిపదికన అదుపులోకి తీసుకున్నారు. ఫరీదుపేటలో పట్ట పగలు వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకుడ్ని హత్య చేసి, ఆ నిందితులు ఊరిలోనే తిరుగుతుంటే చోద్యం చూశారు. యుద్ధ ప్రాతిపదికన అదుపులోకి తీసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ పనిచేయలేదు. వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులంతా సీరియస్‌గా తీసుకుని ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తకోట అమ్మినాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జరిగిన పరిణామాలన్నీ కళ్లముందే కన్పిస్తుండటంతో ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో స్పష్టమవుతోంది.
ఎందుకీ వివక్ష..
ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? రౌడీ రాజ్యంలో ఉన్నామా? అనే సందేహాలు కలగకమానవు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో రెండు ఘటనలలో రెండు రకాలుగా పోలీసులు వ్యవహరించారు. ఒక దగ్గర ఒక న్యాయం, మరోచోట మరో న్యాయం చూపించారు. ప్రజలకు రక్షణ, న్యాయం విషయంలో వివక్ష కనబరిచారు. ప్రెస్‌మీట్‌లోనూ, ఇంకెక్కడైనా పోలీసు అధికారులను అడిగితే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని మాత్రం లీకులిచ్చి నాన్చుడు ధోరణి కనబరుస్తున్నారు. సరికదా హత్యకు గురైన వ్యక్తి ఏ హోదాలో వేరే భార్యభర్తల వివాదాన్ని సెటిల్ చేస్తారని కొందరు పోలీసు అధికారులు సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. హత్య కంటే భార్య భర్తల వివాదం సెటిల్ చేసే విషయాన్నే తప్పుపడుతున్నారు. ఇదేం విధానమో అర్థం కావడం లేదు.
ఎవరిదీ వైఫల్యం?
గతేడాది వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్ హత్య జరిగిన తర్వాత గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు కూడా ఉండేవి. కానీ, హత్య కోసం సీసీ కెమెరాలను నిందితులు ధ్వంసం చేసేశారు. ఆ తర్వాత పోలీసు పికెట్ కళ్లు గప్పి సత్తారు గోపిని చంపేశారు. ఈ రెండు ఎవరి వైఫల్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పోలీసు పికెట్ ఉన్నచోట ఎంత అప్రమత్తంగా ఉండాలో పోలీసు అధికారులకు తెలియంది కాదు. అతి సమస్యాత్మక, శాంతిభద్రతల సమస్య ఉన్న గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత గుర్తు చేయాల్సిన విషయం కాదు. ఘటనకు ముందు సరే.. ఘటన తర్వాత కూడా నిందితులపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేశారు. ఈ లోపే కీలక సూత్రధారి పరారైపోయారు. గతంలో కూన ప్రసాద్ హత్య జరిగిన తర్వాత కూడా ఇదే రకంగా కొందరి నిందితుల విషయంలో సీరియస్‌గా వ్యవహరించలేదు. దాని పర్యావసనమే తాజా హత్య అని సాక్షాత్తు హత్యకు గురైన గోపి కుటుంబీకులే కాదు గ్రామస్తులు కూడా పోలీసు అధికారుల ఎదుటే వాపోవడమే కాకుండా నిలదీసే విధంగా మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సాక్షి పత్రికా కార్యాలయంపై దాడి చేసిన వాళ్లపై కూడా అటు ఎస్పీకి, ఇటు డీఎస్పీకి, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే ఇంత వరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడినది టీడీపీ వారు కావడంతో వారి జోలికి పోలీసులు వెళ్లలేదు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కేసుల నమోదు, చర్యలు తీసుకోవడంలో ఎంత వివక్ష చూపిస్తున్నారో చెప్పడానికి ఇదొక సాక్ష్యం.

నిందితులకు స్వేచ్ఛ

నిందితులకు స్వేచ్ఛ