● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ● నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు ● మురపాకలో రేబిస్‌ మరణంతో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ● నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు ● మురపాకలో రేబిస్‌ మరణంతో అప్రమత్తం

Jul 18 2025 5:02 AM | Updated on Jul 18 2025 5:02 AM

● జిల

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న

అరసవల్లి:

జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ వీధి చూసినా శునకాలు మనుషులపై దాడి చేస్తున్నాయి. నడిచినా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్నా ఒక్కసారిగా వెంబడిస్తూ గాయపరు స్తున్నాయి. దీంతో కుక్క కాటు బాధితుల సంఖ్యలో ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. నగరమైనా, పట్టణమైనా.. గ్రామమైనా.. కుక్కల స్వైర విహారం ఎక్కువవ్వడంతో బాధితులు వేలకు చేరుకున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అపారిశుద్ధ్య వాతావరణం అధికమవుతున్న క్రమంలో వీధి కుక్కల బెడద మరింత పెరుగుతోంది. తాజాగా కుక్క కాటుపై నిర్లక్ష్యం ఫలితంగా జిల్లాలో మురపాకకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. దీంతో ఎక్కడైనా కుక్క కాటుకు గురైన వారు కచ్చితంగా నిర్లక్ష్యం వీడి వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కుక్కకాటు (రేబిస్‌)తో డెత్‌ కేసు నమోదు కావడంతో జిల్లాలో వైద్య శాఖ అప్రమత్తమయ్యింది.

నాలుగు నెలలు.. 2413 కుక్క కాటు కేసులు..

జిల్లాలో 2024–25 వార్షిక సంవత్సరంలో 8963 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2025–26 అంటే ఈ నాలుగు నెలల్లోనే ఏకంగా 2413 కేసులు నమోదవ్వడం గమనార్హం. గత ప్రభుత్వంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఏఆర్‌వీ (యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌) అందుబాటులో ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మందుల సరఫరా వ్యాక్సిన్‌ సరఫరాలు అంతా సగం సగం గానే పంపిణీ అవుతున్నాయి. దీంతో చాలా చోట్ల కుక్క కాటుకు గురైన వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వైద్య సదుపాయాలు దారుణంగా ఉండడంతో సాధారణ జబ్బులతో అవస్థలు పడుతున్న వారి సంఖ్య అధికమవుతున్నారు. దీంతో పాటు కుక్క కాటు బాధితులకు కూడా అవస్థలు తప్పడం లేదు.

వ్యాప్తి ఇలా...

కుక్క కరిచినప్పుడు దాని లాలాజలంలో ఉండే వైరస్‌ మనిషి కండరాల్లోకి చేరుతుంది. కండరాల్లో వైరస్‌ అభివృద్ధి చెంది సున్నితమైన ఫైబర్‌ ద్వారా వెన్నెముకలోకి ప్రవేశిస్తుంది. అక్కడ్నుంచి మెదడుకు, ఆ తరువాత చిన్న మెదడుకు, అనంతరం అన్ని భాగాల్లోకి చేరుతుంది. ఆ తరువాత నాడీ వ్యవస్థనుంచి తిరోగమన ప్రక్రియ ద్వారా లాలాజల గ్రంథుల్లోను, కళ్లు, చర్మంలోకి చేరుకుని అక్కడ్నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది.

ఏడాదిలో ఎప్పుడైనా...

కుక్క కరిచిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు ఏడాదిలోపు ఎప్పుడైనా బయటపడొచ్చని చెబుతున్నారు వైద్యులు.

●30 రోజుల్లో 25 శాతం మందిలో కనిపిస్తాయి.

●30 నుంచి 90 రోజుల్లో 50 శాతం మందిలో బయటపడతాయి.

●90 నుంచి ఏడాది లోపు 20 శాతం, ఒక సంవత్సరం తరువాత 5 శాతం కనిపిస్తాయి.

నీటిని చూసినా.. గాలి పీల్చినా..

మొదటి దశ: జ్వరం, తలనొప్పి, నీరసం, నిరాశ, ఆందోళన, న్యూరోపతిక్‌ నొప్పి, నిద్రలేమి

రెండో దశ: హైపరేక్టివిటీ, ఆందోళన, మూర్ఛ, హైడ్రో ఫోబియా (నీటిని చూస్తే భయం), ఏరో ఫోబియా (గాలి అంటే భయం)

మూడో దశ: రెండు వారాల్లో కోమాలోకి వెళ్లే అవకాశం

నాలుగో దశ: ఒకటి నుంచి ఆరు రోజుల్లో శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది

●ఈ వ్యాధి సోకిన వారికి చివరి దశలో నీటిని చూసినా, గాలిని పీల్చినా మెడలోని గాలిని నియంత్రించే వ్యవస్థలు, నీటిని గుటక వేయడాన్ని నియంత్రించే వ్యవస్థలు, శ్వాస పీల్చే వ్యవస్థలు దెబ్బ తినడంవల్ల మరణం సంభవిస్తుంది.

ఈ చిత్రంలో ఉన్న చిన్నారి పేరు షేక్‌ ఉస్మాన్‌. ఇచ్ఛాపురం మండలం ఎం.తోటూరుకు చెందిన

ఈ చిన్నారి తోటి స్నేహితులతో కలిసి ఈ నెల 15న ఆడుకుంటుండగా ఓ కుక్క దాడి చేసింది.

ఈ ఘటనలో బాలుడి కన్ను, తలపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అదే రోజు, ఇచ్ఛాపురం పట్టణంలోనే ఎ.ప్రణతీ అనే బాలికపైనా వీధి కుక్క దాడి చేసి గాయపరచడంతో ఆసుపత్రిలో చికిత్స అందజేశారు.

లావేరు మండలం మురపాక గ్రామంలోనూ

ఓ యువకుడు కుక్కకాటుతో మృత్యువాతపడ్డాడు. కుక్క కాటు వేసినా వ్యాక్సిన్‌ వేసుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో రేబిస్‌ సోకి మృతి చెందాడు.

శుభ్రంగా కడగాలి

కుక్క కాటుకు గురికాగానే ప్రాథమికంగా వూండ్‌ వాష్‌ చేయాలి. ఇదే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. గాయమైన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగి యాంటీ సెప్టిక్‌ లోషన్‌ రాయాలి. వైరస్‌ శరీరంలోకి ఎక్కకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

– డాక్టర్‌ కె.అనిత,

డీఎంహెచ్‌వో

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న1
1/3

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న2
2/3

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న3
3/3

● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● రోజురోజుకూ పెరుగుతున్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement