
రాష్ట్ర పండగగా బాలియాత్ర
జలుమూరు: శ్రీముఖలింగంలో నవంబరు 9న జరగనున్న బాలియాత్రను ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహించాలని బాలియాత్ర నిర్వహణ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు డాక్టర్ జీవితేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలు, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా కలిసి యాత్రకు సహకరించాలని కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ టి.బలరాం, బి.వి.రమణ, హెచ్ మురళీమోహన్, అర్చకులు శేషాద్రి వెంకటాచలం, నాయుడుగారి జనార్దన్, పంచాది నారాయణమూర్తి, సూర శివ, సీపాన రాము, చింతాడ వెంకటరావు పాల్గొన్నారు.
పెచ్చులూడిన ఆస్పత్రి పైకప్పు
పొందూరు : పొందూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి పైకప్పు గురువారం పెచ్చులూడటంతో రోగులు భయంతో పరుగులు తీశారు. రోగులకు కొద్ది దూరంలో పెచ్చులు పడటంతో ప్రమాదమే తప్పింది. ఆస్పత్రి పక్కనే నూతన భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అయితే బిల్లులు పెండింగులో ఉండటంతో జాప్యం జరగుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని పలువురు కోరుతున్నారు.
పాత పెన్షన్ వర్తింపజేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు, నెమలపురి విష్ణుమూర్తి, రామిరెడ్డి గురువారం డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ న్యాయమైన డిమాండ్ సాధనకు ఈ నెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో జేఏసీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు ఏపీ ఎస్‌టీఏ సంపూర్ణ మద్దతిస్తున్నట్టు పేర్కొన్నారు.
19న ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో భాగంగా ఈ నెల 19న జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు సూచనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రాష్ట్ర పండగగా బాలియాత్ర