
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఐదు రోజులుగా వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడపాదడపా వానలు పడుతున్నప్పటికీ ఎండలు మాత్రం విపరీతంగా కాస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నా రు. వేసవిని తలపించేలా ఎండలు ఉండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో అత్యధికంగా 43 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే ఇప్పుడు 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీనికి తోడు గాలులు లేకపోవడంతో జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకపక్క ఎండలు కాస్తుండగా సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణంలో ఒక్కో రోజు ఒక్కో విధమైన మార్పు కనిపిస్తోంది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లవద్దని, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వృద్ధులు చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. -శ్రీకాకుళం