ప్రైవేటుకు ఆర్టీసీ ఆస్తి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు ఆర్టీసీ ఆస్తి

Jul 17 2025 3:44 AM | Updated on Jul 17 2025 3:44 AM

ప్రైవేటుకు ఆర్టీసీ ఆస్తి

ప్రైవేటుకు ఆర్టీసీ ఆస్తి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

‘సంపద సృష్టిస్తా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా’.. అని చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి చెప్పారు. ఇప్పుడా సంపద సృష్టికి ఏకంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తున్నారు. పైగా వచ్చే ఆదాయమంతా వారికి ఇవ్వడమే వింతగా కనిపిస్తోంది. ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉంటే చాలు ఎంతటి విలువైన ప్రభుత్వ ఆస్తులనైనా ధారాదాత్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉన్న వాటిని కూలగొట్టి, పీపీపీ(పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌)విధానంలో ప్రైవేటు రంగ సంస్థలకు, వ్యక్తులకు అప్పగించాలన్నదే కూటమి ప్రభుత్వం విధానమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్తులపై సర్కారు కన్నుపడింది. తాజాగా ఆ జాబితాలోకి ఆర్టీసీ కాంప్లెక్స్‌ చేరింది. ప్రైవేటుకు చట్టపరమైన అనుమతులు కల్పించడమే పీపీపీ పద్ధతిలో జరగబోయే సిక్కోలు అభివృద్ధిగా చూపించాలని చూస్తోంది.

ప్రైవేటు చేతుల్లోకి ఆర్టీసీ కాంప్లెక్స్‌..

శ్రీకాకుళం నడిబొడ్డున, విలువైన స్థలంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఉంది. దాదాపు 16.50 ఎకరాల విస్తీర్ణంలో డిపోతో సహా ఉంది. ఒక్క కాంప్లెక్సే 6.50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒకటో డిపో గ్యారేజీ 5.50ఎకరాలు, రెండో డిపో గ్యారేజీ 4.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో 69 షాపులు ప్రస్తుతం ఉన్నాయి. వాటిలో 9 తొమ్మిది షాపులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మిగతావన్నీ ఆక్యుపెన్సీలో ఉన్నాయి. వీటి ద్వారా నెల వారీ అద్దెగా రూ.12,93,421 ఆదాయం వస్తోంది. ఇంతటి విలువైన, భారీగా నెల వారీ ఆదాయం వచ్చే ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు వచ్చి పరిశీలన కూడా చేశారు. పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానంలో ఆ సంస్థకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ అప్పగిస్తే, వారంతా పునర్నిర్మాణం చేపట్టి, తద్వారా నిర్వహణ బాధ్యతలు తీసుకుని, దాని ద్వారా వచ్చే ఆదాయం ఆ సంస్థే పొందేలా ఒప్పందం చేసుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం కలెక్టరేట్‌లో దానికి సంబంధించిన ఫైలు ప్రాసెస్‌లో ఉంది. ఏ క్షణంలోనైనా ఒప్పందం జరగనుంది. ఆ తర్వాత ప్రైవేటు సంస్థ చేతికి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వెళ్లిపోతుంది.

బాబుకు అలవాటైన పనే..

ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమనేది చంద్రబాబు నైజం. తాను అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ ప్రభుత్వ ఆస్తులను, సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అలవాటు. ఇప్పుడదే జరుగుతోంది. తెరవెనక మంతనాలు, ఒప్పందాలు, నేతలకొచ్చే స్వప్రయోజనాలు పక్కన పెడితే ప్రభుత్వ ఆస్తులు కాస్త ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఒక్క ఆర్టీసీ కాంప్లెక్సే కాదు కావాల్సిన సంస్థలు ముందుకొస్తే నగరంలోని అనేక ప్రభుత్వ సంస్థలు, ఆస్తులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ తరహాలోనే జిల్లా కేంద్ర గ్రంథాలయం కూడా అప్పగించేందుకు సిద్ధమవుతోంది. మున్ముందు శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం, పొట్టి శ్రీరాముల మార్కెట్‌, బాపూజీ కళా మందిర్‌, పెద్దపాడు చెరువు స్థలం తదితర వాటిని కూడా పీపీపీ విధానంలో అప్పగించాలని యోచిస్తోంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. అదే జరిగితే నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోనుంది. అంతేకాకుండా యూజర్‌ చార్జీల పేరుతో పీపీపీ విధానంలో తీసుకున్న సంస్థలు ప్రజలపై భారం మోపే అవకాశం కూడా లేకపోలేదు.

అభివృద్ధి చేసి నిర్వహించుకునేలా ప్రైవేటు సంస్థకు అప్పగింత

వచ్చే ఆదాయమంతా వారికే..

ఆ దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం

పీపీపీ విధానంలో ఒప్పందానికి సిద్ధం

కావాల్సిన వారు ముందుకొస్తే మరికొన్ని ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేసే యోచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement