
వ్యక్తిపై గొడ్డలితో దాడి
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన దుక్క సంతోష్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన జీరు శంకర్ రెడ్డి సోమవారం రాత్రి గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుక్క రమేష్ అనే వ్యక్తి స్నానం చేస్తుండగా ఆ నీరు జీరు శంకర్‌రెడ్డి ఇంటి ముందునుంచి వెళ్తుండటంతో గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో రమేష్ అన్న కుమారుడు సంతోష్‌కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మద్యం మత్తులో ఉన్న శంకర్ రెడ్డి తన ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకువచ్చి సంతోష్‌కుమార్ తలపై దాడిచేశాడు. గాయపడిన సంతోష్‌కుమార్‌ను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.