
‘విద్యార్థులపై సర్కారు నిర్లక్ష్యం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో దళిత విద్యార్థులను కూటమి ప్రభు త్వం చిన్నచూపు చూస్తోందని దళిత సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ విజ్ఞానమందిర్‌లో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు ఇస్తున్న కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వకుండా రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, విశాఖ జిల్లా గొలుగొండ, విజయనగరం జిల్లా కొప్పేర్ల మొదలుకొని చిత్తూరు జిల్లా వరకు దళిత విద్యార్థులు గురుకులాల్లో దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బాలికల/బాలుర గురుకుల పాఠశాల 1983 స్థాపించారని సుమారుగా 30 సంవత్సరాల నుంచి అవే భవనాలు ఉండడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లనే దళిత విద్యార్థులు విద్యా అవకాశాలకు దూరమైపోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేకమైన కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు.