
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజలు ఇచ్చే అర్జీలను వేగవంతంగా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజల నుంచి 154 విజ్ఞప్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి పారదర్శకమైన విచారణ జరిపి, నిర్ణీత సమయంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ఆదేశించారు.
ఈవోపై విచారణ చేయాలి
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర ఆలయ ఈవో అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయన అవినీతిపై విచారణ చేయాలని మీకోసంలో శ్రీముఖలింగంకి చెందిన ఎన్.రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. కార్తీక మాసం, మహా శివరాత్రి పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలకు, తాత్కాలిక మౌలిక వసతులకు అయ్యే ఖర్చు, ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వహణ ఖర్చులకు దొంగ బిల్లులు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ర్యాంపు నిర్వహణ ఆపాలి
గార మండలంలోని గార గ్రామంలో నడుపుతున్న ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని ఎంపీపీ గొండు రఘురాం, పీస గోపీ, ముంజేటి కృష్ణమూర్తిలు కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ తవ్వకాల వలన గ్రామ ప్రజలతో పాటు మండలంలో ఉన్న వంశధార నదీ పరివాహక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం నుంచి 100 మీటర్ల దూరంలో గార మండలానికి మంచినీటిని అందించే ప్రాజెక్టు ఉందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వలన ప్రాజెక్టుకు నీరు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులకు చెందిన సుమారు 100 వ్యవసాయ పంపునట్లు ద్వారా వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికై నా అక్రమ ఇసుక తవ్వకాలపై తగు చర్యలను తీసుకోవాలని విన్నవించారు.
ఐదు ల్యాప్‌టాప్‌ల పంపిణీ
డిగ్రీ ఆపైన చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు విభిన్న ప్రతిభావంతులు, వయో వద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐదు ల్యాప్‌టాప్‌లు, ఒక స్మార్ట్‌ఫోన్‌ను కలెక్టర్ చేతుల మీదుగాా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిజబుల్ డిపార్టుమెంట్ ఏడీ కవిత తదితరులు ఉన్నారు.
దౌర్జన్యాలను
కట్టడి చేయండి
కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు మీకోసంలో సోమవారం ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు, ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు, చిరుద్యోగులకు రక్షణ కరువైయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరుబుజ్జిలి మండలంలోని తెలికిపెంట గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ పంచాయతీ నిధులు తన భర్త పేరుమీద అన్యాక్రాంతం చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన వారిపై, విచారణకు వచ్చిన అధికారులపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఘటనపై విచారణ జరిపాలని కోరారు. సరుబుజ్జిలి మండలంలోని మతలబుపేట పంచాయతీలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేస్తూ, టీడీపీ నాయకులు తమ సొంత పొలాలకు సీసీ రోడ్లు వేస్తున్నారని, ఆ పనుల బిల్లులు నిలుపుదల చేయాలని విన్నవించారు. ఆమదాలవలస మున్సిపాలిటీలోని వూసవానిపేటకు చెందిన దివ్యాంగ బాలుడికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బూర్జ మండలంలోని కటకమయ్యపేట గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు వితంతు పెన్షన్‌లు రాజకీయ కారణాలతో మంజూరు చేయడంలేదని, వారికి పెన్షన్‌లు ఇప్పించాలని కోరారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామంలో ఉపాధి పనుల్లో టీడీపీ నాయకులు చేస్తున్న అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు 45 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (గ్రీవెన్సు)లో 45 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు ప్రజల ఫిర్యాదులపై జాప్యం వహించరాదని, సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు.

అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి

అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి