
పాత పింఛన్ విధానం అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని 2003 డీఎస్సీ జిల్లా ఫోరం కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానం అమలు కోరుతూ శ్రీకాకుళంలోని జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పోస్టుకార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలకు సోమవారం పంపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ బలగ శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలైన తేదీ 2004 సెప్టెంబర్ ఒకటి కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా తాము నియమితులయ్యామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కేంద్ర మెమో 57 ప్రకారం పాత పింఛన్‌కు అర్హులని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విడతలు వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్సీ 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు గురుగుబెల్లి భాస్కరరావు, బుచ్చిబాబు, అనిల్ కుమార్, మాధవి, శ్రీదేవి, లోకనాథం, రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.