నూర్పు చేస్తుండగా మంటలు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం పంచాయతీ శాలిపేట గ్రామంలో ఆదివారం వరి చేను నూర్పు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. మరో వైపు మంటల ధాటికి వరి చేను కూడా కాలిపోయింది. హరిశ్చంద్రాపురం గ్రామానికి చెందిన బల్లి అప్పలరాజు తన ట్రా క్టర్, నూర్పు యంత్రంతో శాలిపేట గ్రామానికి చెందిన మార్పు భూషణం అనే రైతుకు చెందిన సుమారు 2 ఎకరాల వరిచేనును నూర్పు చేస్తుండగా, అకస్మాత్తుగా ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనతో అంతా పరుగులు తీశారు. ఒక్క సారిగా మంటలు వ్యాపించి ట్రాక్టర్ ఇంజిన్ మొత్తం అగ్నికి ఆహుతి కాగా మరో వైపు వరి చేను కాలిపోయింది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోగా అంతా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఒక వైపు ట్రాక్టర్ యజ మాని అప్పలరాజు, మరో వైపు రైతు భూషణం తమకు జరిగిన భారీ నష్టంతో బోరున విలపించారు.


