ఆధిపత్యపోరులో అంతమొందించారు | - | Sakshi
Sakshi News home page

ఆధిపత్యపోరులో అంతమొందించారు

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

గుంతకల్లు: ట్రాన్స్‌జెండర్ల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజూమున గుంతకల్లులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మస్తాన్‌పేట్‌లోని రెడ్‌ ట్యాంక్‌ వద్ద మూడు రోజుల క్రితం వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ప్రారంభోత్సవానికి అపర్ణ అనే ట్రాన్స్‌ జెండర్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. చిత్ర అనే మరో ట్రాన్స్‌జెండర్‌ సన్నిహితుడిగా ఉన్న బోయ వీరేష్‌ ఇది జీర్ణించుకోలేక ఫ్లెక్సీలను చించేశాడు. ఆ సమయంలో చిన్నపాటి గొడవ జరి గింది. వాస్తవానికి చిత్ర, అపర్ణ మధ్య కొన్నినెలలుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం అపర్ణ వర్గం ర్యాలీ కూడా నిర్వహించింది. ఇదిలా ఉండగా.. అపర్ణ వర్గానికి చెందిన వికాష్‌ తన స్నేహితుడితో కలిసి మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో బెంచికొట్టాల సమీపంలోని బోయ వీరేష్‌ ఇంటి మీదుగా ద్విచక్రవాహనంలో వెళ్తుండగా.. వారిని వీరేష్‌ అడ్డుకున్నాడు. వాదనకు దిగి గొడవ పెట్టుకున్నాడు. వికాష్‌పై వీరేష్‌తో పాటు పలువురు దాడి కూడా చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన వికాష్‌ తన స్నేహితులు, బంధువులతో కలసి బుధవారం తెల్లవారుజూమున మూడు గంటల సమయంలో వీరేష్‌ ఇంటిపై దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న వీరేష్‌ తమ్ముడు చరణ్‌ అలియాస్‌ జగన్‌ ప్రతిదాడికి యత్నించాడు. ఈ క్రమంలో వికాష్‌ సమీప బంధువులు చరణ్‌ను కొడవలితో నరికారు. మెడపై, తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే వీరేష్‌ తలపై దాడి చేయడంతో బలమైన గాయమైంది. వీరితో పాటు వికాష్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరేష్‌ను మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించగా, వికాష్‌ను కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై వన్‌టౌన్‌ సీఐ మనోహర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

● హత్యకు గురైన చరణ్‌ రాడ్‌ బెండింగ్‌ కూలీగా పని చేసేవాడు. భార్య ఐశ్వర్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను గతంలో వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

హత్యకు గురైన చరణ్‌ అలియాస్‌ జగన్‌ (ఫైల్‌)

చరణ్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, బంధువులు

ట్రాన్స్‌జెండర్ల మధ్య వర్గపోరు

ఇరువర్గాల ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement