మడకశిర: పట్టణంలోని ప్రభుత్వ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ పోస్టు చాలా రోజులుగా ఖాళీగా ఉంది. దీంతో కళాశాల నిర్వహణ, సిబ్బంది వేతనాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అదే కళాశాలలో పనిచేస్తున్న వారికి ఇన్‌చార్జ్‌గా ఇద్దామని ప్రభుత్వం భావిస్తున్నా ‘మాకొద్దు..బాబోయ్’ అంటూ అధ్యాపకులు తప్పుకుంటున్నారు.
2008 నుంచి ప్రిన్సిపాల్ పోస్టు పెండింగ్..
2008లో మడకశిరకు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల మంజూరైంది. అయితే ప్రిన్సిపాల్ పోస్టు మాత్రం మంజూరు కాలేదు. దీంతో ఉన్నతాధికారులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మహేష్‌ను ఒకేషనల్ జూనియర్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అప్పటి నుంచే ఆయనే ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా కొనసాగారు. అయితే ఇటీవల ఆయనకు పదోన్నతి రాగా, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పుకుని డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు.
ఇన్‌చార్జ్ బాధ్యతలకు విముఖత..
మహేష్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వం ఒకేషనల్ జూనియర్ కళాశాలలోనే ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పని చేస్తున్న శిరోమణిని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, అందువల్ల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తాను నిర్వర్తించలేనంటూ ఆమె ఇటీవలే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీంతో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
అందని వేతనాలు..
2008 నుంచి ఒకేషనల్ జూనియర్ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్టు మంజూరు కాకపోవడంతో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాలే కళాశాల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ప్రధానంగా అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి డ్రాయింగ్ అధికారిగా కూడా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాలే వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల నుంచి కళాశాలకు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ లేక పోవడంతో అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు అందడం లేదు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి నెలల పాటు వేతనాలు అందక నానా తంటాలు పడుతున్నారు. అయినా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించడానికి అధ్యాపకులెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రిన్సిపాల్ పోస్టు మంజూరు చేయాలని, లేదంటే మరో కళాశాల అధ్యాపకులెవరినైనా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించాలని సిబ్బంది కోరుతున్నారు.
ఒకేషనల్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణకు విముఖత
ఇటీవలే ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా శిరోమణి నియామకం
అనారోగ్య కారణంతో
బాధ్యతలు స్వీకరించలేనంటూ లేఖ
ప్రిన్సిపాల్ లేకపోవడంతో
మూడు నెలలుగా అందని వేతనాలు


