సూడో నక్సలైట్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

సూడో నక్సలైట్‌ అరెస్టు

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

పావగడ: సూడో నక్సలైట్‌ కనికలబండ ఉప్పర వెంకటేశ్‌ (46)ను పట్టుకునేందుకు పావగడ, మధుగిరి పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌ విజయవంతమైంది. మంగళవారం రాత్రి కడమలకుంట గ్రామ సరిహద్దులోని సోలార్‌ పార్క్‌ వద్ద మద్యం మత్తులో నిందితుడు ఉప్పర వెంకటేశ్‌ దొరికి పోయాడు. ఇటీవల రైతు నాగభూషప్ప ఇంటి గోడకు వెంకటేశ్‌ అతికించిన బెదిరింపు లేఖలో రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఈ నెల 16ను డెడ్‌ లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు అతను అరెస్ట్‌ కావడం గమనార్హం. కొంత కాలంగా కనికలబండ గ్రామంలో దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతూ గ్రామస్తులకు ఇతను కంటి మీద కునుకు లేకుండా చేశాడు. గత నెల 29న గ్రామానికి చెందిన రైతు కరియణ్ణ పంప్‌ సెట్‌కు నాటు బాంబు బిగించి హత్యకు కుట్ర పన్నాడు. అదృష్టవశాత్తు కరియణ్ణ ప్రాణాలతో బయట పడ్డాడు. ఇటీవల గంగసాగర రైతు నాగభూషప్పకు పీపుల్స్‌ వార్‌ దేవన్న దళం పేరిట రూ. 5 లక్షలు డిమాండ్‌ చేస్తూ బెదిరింపు లేఖ రాసి గ్రామంలో గోడకు అతికించాడు. ఈ క్రమంలోనే అతడిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు సిబ్బంది కూంబింగ్‌ నిర్వహించారు. మంగళవారం రాత్రి కడమలకుంట గ్రామ శివార్లలో మద్యం సేవిస్తున్న ఉప్పర వెంకటేశ్‌ను అరెస్ట్‌ చేశారు.

● నిందితుడు ఉప్పర వెంకటేశ్‌ పట్టణంలోని బాపూజీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. అనంతరం సూడో నక్సల్‌గా మారి డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడ్డాడు. పట్టణ సమీప రామగిరి మండలంలో గతంలో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కూంబింగ్‌లో అడిషనల్‌ ఎస్పీ గోపాలయ్య, డీవైఎస్పీ మంజునాథ్‌, సీఐలు సురేశ్‌, కొట్రేశ్‌, ఎస్‌ఐ సునీల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement