రొళ్ల: వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ యువకులు వరుణుడి ప్రతిమను ఊరేగించారు. బుధవారం మధ్యాహ్నం మండల పరిధిలోని దొమ్మరహట్టి గ్రామానికి చెందిన యువకులు మట్టితో వరుణుడి ప్రతిమను తయారు చేసుకుని పూలతో అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటా తిరిగి నిత్యావసర సరుకులను సేకరించారు. ప్రజలు వరుణుని ప్రతిమకు అడుగడుగునా పూజలు చేశారు. వరుణుడి ప్రతిమను మూడు రోజుల పాటు ఊరేగించిన తర్వాత హులికుంట చెరువులో నిమజ్జం చేస్తామన్నారు. నిమజ్జనం రోజున అన్నదానం ఉంటుందని, ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని నమ్మకమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి మంజునాథ్, మాజీ వైస్ సర్పంచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర మండలం సింగేపల్లిలో..
మడకశిరరూరల్: వర్షాలు కురిపించి ఎండుతున్న పంటలను కాపాడాలని వరుణుని ప్రతిమను బుధవారం మహిళలు సింగేపల్లిలో ఊరేగింపు నిర్వహించారు. ఇంటింటా ప్రతిమకు నీరు పోసి పూజలు చేశారు. బియ్యం, కంది పప్పు తదితర వంట సామగ్రిని అందించారు. సేకరించిన ధాన్యంతో శనివారం సమారాధన నిర్వహిస్తామని మహిళలు తెలిపారు.
డీజేకు అనుమతించాలంటూ ఆందోళన
రొద్దం: డీజేకు అనుమతించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేసిన ఘటన మండల పరిధిలోని పి.రొప్పాలలో జరిగింది. స్థానిక దళిత వాడలో బుధవారం సాయంత్రం పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు మడకశిర–పెనుకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామంలో కొందరికి అనుమతించి తమకు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పోలీసులు మాట్లాడుతూ డీజేకు అనుమతులు ఇవ్వడానికి తమకు అధికారం లేదన్నారు. పెద్ద శబ్దం లేకుండా వినాయక నిమజ్జనం జరుపుకోవాలని సర్దిచెప్పడంతో కార్యక్రమం యథావిధిగా సాగింది.
వివాహిత అనుమానాస్పద మృతి
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): మండలంలోని మురడి గ్రామంలో సంధ్య (22) అనే వివాహిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన మేరకు.. శెట్టూరు మండలం మంగంపల్లికి చెందిన సంధ్యకు మురడి గ్రామానికి చెందిన తిప్పేస్వామితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. బుధవారం రాత్రి సంధ్య ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే భర్త తిప్పేస్వామి, అత్తామామలు, బంధువులు, స్థానికుల సహకారంతో ఆమెను రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


