ధర్మవరం అర్బన్: యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు. పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం, ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 20 నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ సీజన్–3 ముగిసింది. బుధవారం ఫైనల్ మ్యాచ్‌లో డ్రాగన్ లెవన్, పెనుకొండ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన డ్రాగన్ లెవన్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెనుకొండ జట్టు 15 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో డ్రాగన్ లెవన్ జట్టు 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విజేత డ్రాగన్ లెవన్ జట్టుకు మంత్రి సత్యకుమార్ రూ.లక్ష నగదు బహుమతితోపాటు ట్రోఫీ అందించారు. రన్నరప్‌గా నిలిచిన పెనుకొండ జట్టుకు రూ.50 వేల నగదు బహుమతి, ట్రోఫీ అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, జిల్లా ఇన్‌చార్జ్ నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సత్యకుమార్


