కళ్యాణదుర్గం: ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన శనివారం కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు...కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు 14 మంది తుపాన్ వాహనంలో అనంతపురం వెళ్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా వైఎన్‌హెచ్ కోటకు చెందిన బంగారి అనే వ్యక్తి కారులో తన భార్యను అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. బోరంపల్లి సోలార్ ప్లాంట్ వద్ద ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బంగారి, అతని భార్యతో పాటు తుపాన్ వాహన డ్రైవర్ జిలాన్, పలువురు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిసింది.


