మడకశిర: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా పట్టు రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదు. ఇప్పటికే పలుమార్లు బాధిత రైతులు ఆందోళనలు, నిరసనలు చేసినా దిగిరాలేదు. దీంతో పట్టు రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 28 వేల మంది పట్టు రైతులు ఉన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఏటా రికార్డు స్థాయిలో బైవోల్టిన్ పట్టుగూళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్ ప్రసిద్ధి గాంచింది. రైతులు ఇక్కడ విక్రయించే బైవోల్టిన్ పట్టుగూళ్లకు కేజీకి రూ.50 చొప్పున ప్రోత్సాహకాన్ని అందించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పైసా చెల్లించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సాహక బకాయిలు రూ.60 కోట్లకుపైగా పేరుకుపోగా.. జిల్లాలో రూ.25 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు.
సబ్సిడీలోనూ అంతే..
పట్టు రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయి. సెంట్రల్ సిల్క్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పథకాలు అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా రేరింగ్ షెడ్లు, ప్లాంటేషన్, మందులు తదితర వాటికి సబ్సిడీ అందించాల్సి ఉన్నా ఏడాది నుంచి అందలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో రూ.13 కోట్ల వరకు బకాయిలున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తన వాటా ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5న మహా ర్యాలీ
సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు పట్టు రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వినతి పత్రాలు అందించారు. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీంతో పట్టు రైతులు ఈ నెల 5న హిందూపురంలో మహార్యాలీకి సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వేలాది మంది పట్టు రైతులు ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలిసింది.
చంద్రబాబు ప్రభుత్వంలో బైవోల్టిన్ రైతులకు అందని ప్రోత్సాహకం
పేరుకు పోయిన బకాయిలు
ప్రజాప్రతినిధులు, అధికారులకు
విన్నవించుకున్నా ఫలితం శూన్యం
సమస్యల పరిష్కారానికి
5న ‘పురం’లో మహార్యాలీ
ప్రభుత్వ కళ్లు తెరిపిస్తాం
పట్టు రైతుల సమస్యలపై గతంలో ఆందోళనలు, నిరసనలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. తాజాగా హిందూపురంలో నిర్వహించే మహార్యాలీ ప్రభుత్వ కళ్లు తెరిపిస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ‘పురం’ పట్టుగూళ్ల మార్కెట్ నిర్మాణానికి నిధులివ్వాలి.
–సోమ్‌కుమార్,
జిల్లా పట్టు రైతుల సంఘం అధ్యక్షుడు
ఆదుకోకుంటే కనుమరుగే
కొన్నేళ్లుగా బైవోల్టిన్ పట్టుగూళ్లను పండిస్తున్నా. ప్రభుత్వం నుంచి నాకు రూ.లక్షల్లో ప్రోత్సాహక నగదు అందాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం పట్టు రైతులకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలి. లేకపోతే పట్టు పరిశ్రమే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
– సన్నమారప్ప, కొత్తపాళ్యం, రొళ్ల మండలం
ఇతని పేరు దశనాథరెడ్డి. మడకశిర మండలం పాప సానిపల్లికి చెందిన ఈయనకు రెండెకరాల మల్బరీ తోట ఉంది. ఏటా 1,000 కేజీల బైవోల్టిన్ పట్టుగూళ్లు ఉత్పత్తి చేస్తాడు. ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్‌లో విక్రయించిన ప్రతి కేజీకి రూ.50 చొప్పున అదనంగా
ప్రోత్సాహకం అందించాల్సి ఉన్నా
చంద్రబాబు ప్రభుత్వంలో పైసా అందలేదని దశనాథ రెడ్డి వాపోతున్నాడు.


