● కాపు కాసి వాహన డ్రైవర్‌ను
పట్టుకున్న గ్రామస్తులు
బత్తలపల్లి: గుప్తనిధుల తవ్వకాలను గ్రామస్తులు భగ్నం చేశారు. ముఠాకు చెందిన ఒకరిని పట్టుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. మండలంలోని అప్రాచెరువు గ్రామ సమీపంలో ఉన్న అపరాదయ్య బండ వద్ద కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు సాగిస్తున్నారు. శనివారం రాత్రి వారిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు సూలా నరసింహులు,బుట్రా గోపాల్, సంగాల నాగరాజు, సూలా ఓబన్న ఆ ప్రాంతంలో మాటువేయగా.. అర్ధరాత్రి సమయంలో టవేరా వాహనంలో ఏడుగురు దుండగలు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలియగానే అపరాదయ్య బండ వద్దకు గ్రామస్తులతో కలిసి సింగిల్‌విండో అధ్యక్షుడు ఆకులేటి వీరనారప్ప వచ్చారు.అందరూ కలిసి దుండగులను పట్టుకునేందుకు యత్నించగా వారు పారిపోయారు. డ్రైవర్ వాహనంతో పాటు పారిపోతుండగా గ్రామస్తులు వాహనాల్లో వెంబడించారు. జాతీయ రహదారిపై సంకేపల్లి వద్ద పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి కుమారుడు కొండూరు సుధీర్‌రెడ్డిగా గుర్తించారు. పోలీసులు టవేరా వాహనంతోపాటు తవ్వకాల కోసం తెచ్చిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల కోసం పామిడికి చెందిన ఇద్దరు, కల్లూరుకు చెందిన ఇద్దరు, అనంతపురానికి చెందిన ఇద్దరు వచ్చినట్లు తెలిసింది.


