మెగా కాదు.. దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా కాదు.. దగా డీఎస్సీ

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

పరిగి: చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ మాటున దగా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. మండలంలోని శ్రీరంగరాజుపల్లి పంచాయతీ పరిధి ముల్లమోతుకపల్లిలో ఆదివారం సాయంత్రం కాఫీ విత్‌ వైఎస్సార్‌సీపీ లీడర్స్‌ కార్యక్రమం నిర్వహించారు. తొలుత పార్టీ శ్రేణులతో కలిసి గొరవనహళ్లి గేట్‌ నుంచి రెండు కిలోమీటర్ల మేర బైకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ప్రతి గడపకూ వెళ్లి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తామంతా జగనన్నకు తోడుగా ఉంటామని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ప్రజలు ఉషశ్రీచరణ్‌కు తెలిపారు.

మోసం చేయడం బాబుకు మామూలే..

మోసానికి చంద్రబాబు నిలువెత్తు రూపమని, ఆయన నోటి వెంట అబద్ధాలు తప్ప నిజాలు రావని ఉషశ్రీచరణ్‌ విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ నిరుద్యోగ యువతను నిండా ముంచారన్నారు. ఏళ్లుగా కష్టపడి చదివి అర్హత సాధించిన వారికి ఉద్యోగాలివ్వకుండా అనర్హులకు జాబులిచ్చి కోట్లాది రూపాయల స్కామ్‌కు పాల్పడిన మంత్రి ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని, లేకపోతే ఉద్యోగార్థులే పదవిని ఊడగొడతారని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు సర్కార్‌కు వారి శాపం తగులుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో దశలవారీగా పోరాటాన్ని కొనసాగిస్తామని, నిరుద్యోగ యువత కదిలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్లుగానే, అంతకంటే ఎక్కువ స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిన మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు.

బాబొస్తే కరువు..

దేశమంతా వర్షాలు పడుతున్నా ఆంధ్రప్రదేశ్‌లో వరుణదేవుడు కరుణించపోవడానికి కారణం చంద్రబాబేనని ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉన్నారన్నారు. నేడు కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నను చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆదుకోవడం లేదన్నారు. ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం లేదని, అన్నదాత సుఖీభవ పథకంలో అరకొర నిధులు మంజూరు చేసి మోసగించిన ఈ ప్రభుత్వాన్ని రైతులే కూలగొడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని జనం చెబుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ

జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement