తిరుపతి–మంత్రాలయం మధ్య ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

తిరుపతి–మంత్రాలయం మధ్య ప్రత్యేక రైళ్లు

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

గుంతకల్లు: ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసే విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు తిరుపతి–మంత్రాలయం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజనల్‌ కమర్షియల్‌ అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి ప్రత్యేక రైలు (07429) రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మంత్రాలయం చేరుతుంది. తిరిగి మరో ప్రత్యేక రైలు (07430) మంత్రాలయం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజూమున 2 గంటలకు తిరుపతి జంక్షన్‌కు చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, కోడూరు, ఓబుళవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, బాక్రాయిపేట, కడప, కమలాపురం, యర్రగుంట్ల,ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, నక్కనదొడ్డి, గుంతకల్లు, ఆదోని, కోసిగి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

ముగిసిన బాలవికాస్‌

గురువుల సదస్సు

ప్రశాంతి నిలయం: బాలవికాస్‌ గురువుల సదస్సు ఆదివారం ముగిసింది. ప్రశాంతి నిలయంలో మూడు రోజుల పాటు బాలవికాస్‌ విద్యా లక్ష్యాలు, మరింత అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తూ సదస్సు సాగింది. సత్యసాయి బోధనలకు అనుగుణంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తీర్మానించారు. తమ కర్తవ్యాన్ని, సత్యసాయి సూచించిన లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని గురువులు ప్రతిజ్ఞ చేశారు. బాలవికాస్‌ చిన్నారులు, పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు వైఎస్‌ జగన్‌ కృషి

చిలమత్తూరు: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయ సాధనకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ కృషి చేస్తుందని పార్టీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక అన్నారు. హిందూపురం రూరల్‌ మండల పరిధిలోని గొల్లాపురంలో ఆదివారం నిర్వహించిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో అంబేడ్కర్‌ మనవడు భీమ్‌రావ్‌ యశ్వంత్‌తో కలిసి టీఎన్‌ దీపిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీపిక మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన ఐదేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ కృషి చేశారని కొనియాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. అణగారిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి తిప్పేరుద్రయ్య, పట్టణ కన్వీనర్‌ శ్రీరాములు, ఎస్‌సీ సెల్‌ జిల్లా నేత జంగం చందు, రామాంజి, మాజీ సర్పంచ్‌ దేవరాజు, నాయకులు శివారెడ్డి, రంగనాథ్‌, శివ, గంగాధర్‌, జయచంద్ర, మంజు, హయత్‌ భాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement