● అనంతపురానికి చెందిన జూటూరు రెడ్డప్ప టీచర్ పోస్టు కోసం తీవ్రంగా శ్రమించాడు. కష్టపడి పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాడు. ఎస్సీ గ్రూప్–3 కేటగిరీలో 57 మార్కులు సాధించి 219వ ర్యాంకులో నిలిచాడు. ఉద్యోగం ఖాయం అనుకుని బంధుమిత్రులందరికీ చెప్పుకున్నాడు. తీరా చూస్తే.. రెడ్డప్పకు రావాల్సిన ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఎవరో అభ్యర్థి ఎగరేసుకుపోయాడు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఒక స్వప్నం. అహోరాత్రులు శ్రమించి, తిండీ తిప్పలు మాని.. కుటుంబాలకు దూరంగా అరకొర వసతుల మధ్య పరీక్షల కోసం కష్టపడుతుంటారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చాక కష్టపడి పరీక్షలు రాస్తే అర్హత ఉన్న వారికి కాకుండా దొంగదారిలో వచ్చిన వారు ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు.
తొలి సంతకమే.. భారీ స్కాం
ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీ. రాష్ట్ర వ్యాప్తంగా 16,437 పోస్టులను భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇందులో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు అన్ని అర్హతలూ ఉన్నా పట్టించుకోకుండా.. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు సార్.. మా అర్హతను పరిగ ణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇవ్వండని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
811 పోస్టులకు నోటిఫికేషన్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 811 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సుమారు 46 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 39,943 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎంపికై న అభ్యర్థులకు నేరుగా ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత సెలక్షన్ లిస్టులో మీ పేర్లు లేవంటూ అధికారులు చావుకబురు చల్లగా చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని.. అంతా విజయవాడ నుంచే అభ్యర్థుల జాబితా వస్తోందని జిల్లా విద్యాశాఖాధికారులు చేతులెత్తేశారు.
స్పోర్ట్స్ కోటాలో 22 పోస్టులు
ఉమ్మడి జిల్లాలో మొత్తం 811 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో 22 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు. అయితే స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
నేడు భారీ ర్యాలీ
డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టి.. అర్హులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు మంగళవారం జిల్లా కేంద్రం పుట్టపర్తిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేసి తన నైతికతను నిరూపించుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేటి భారీ ర్యాలీకి విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
విజయవంతం చేయండి
నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తిలోని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుంది. గణేష్ సర్కిల్ వరకూ కొనసాగుతుంది. విద్యార్థులు, యువత భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి. డీఎస్సీలో అవకతవకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు న్యాయం జరిగే వరకూ పార్టీ తరఫున పోరాడతాం.
– గంగుల సుధీర్‌కుమార్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తు నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలి. అర్హత ఉండీ ఉద్యోగం రాని అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున భృతి చెల్లించాలి. ఈ డిమాండ్లపై మంగళవారం చేపట్టే భారీ ర్యాలీకి నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.
– పురుషోత్తం రాయల్,
వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
కనగానపల్లి మండలం కుర్లపల్లి తండాకు చెందిన సుగాలి గోపాల్‌నాయక్ స్కూల్ అసిస్టెంట్ (సోషల్) పరీక్ష రాసి 71.65 మార్కులతో జనరల్‌లో 121వ ర్యాంకు సాధించాడు. ఎస్టీ కేటగిరిలో కచ్చితంగా ఉద్యోగం వస్తుందని సంతోషపడ్డాడు. అయితే తనకు రావాల్సిన ఉద్యోగాన్ని స్పోర్ట్స్ కోటాకు కేటాయించామని.. ఏమైనా అభ్యంతరాలుంటే మంగళగిరిలోని విద్యాశాఖాధికారులను సంప్రదించాలని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు.
ఇలా డీఎస్సీ పేరుతో దగా చేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అర్హులకు చేసిన అన్యాయంపై పోరుబాటకు సిద్ధమయ్యారు.


