ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి సమీపంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో ‘పరిష్కార వేదిక’ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు.. వివిధ సమస్యలపై 332 అర్జీలు అందించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందే అర్జీలను క్షుణ్ణంగా చదివి అర్హత మేరకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఏదశలోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ సువర్ణ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం
● ధర్మవరం నూతన ఆర్డీఓ
రాంభూపాల్‌రెడ్డి
ధర్మవరం అర్బన్: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందేలా తనవంతు కృషి చేస్తానని ధర్మవరం నూతన ఆర్డీఓ రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ ఏఓ ఖతిజున్‌కుఫ్రా, పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ మహేష్ నాలుగు నెలల క్రితం బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ ఆర్డీఓలు కొనసాగారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభుత్వం నంద్యాలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాంభూపాల్‌రెడ్డిని ధర్మవరం ఆర్డీఓగా బదిలీ చేసింది. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. డివిజన్ పరిధిలోని సమస్యలపై ఆరా తీశారు.
అత్యాచార నిందితులను
కఠినంగా శిక్షించాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్
పెనుకొండ రూరల్: దళిత బాలికపై అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ఓ మహిళ హోంమంత్రిగా రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోవడం చూస్తే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గోరంట్ల మండంలోని ఓ గ్రామంలో అభం, శుభం తెలియని బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేయగా... బాలిక గర్భం దాల్చిందని, ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకే కాదు బాలికలకు కూడా రక్షణ కరువైందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయన్నారు. అయినా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. అందువల్లే బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. ఇప్పటికై నా ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
డీటీ ప్యానల్ విడుదల
అనంతపురం అర్బన్: తహసీల్దారు పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 92 మందితో డీటీ (డిప్యూటీ తహసీల్దార్) ప్యానల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వారంలోగా సమర్పించాలని సూచించింది. 2018–19కు సంబంధించి 15 మంది డీటీలు, 2019–20కు 16 మంది, 2020–21కు 31 మంది, 2021–22కు ముగ్గురు, 2022–23కు 18 మంది, 2023–24కు నలుగురు, 2024–25కు సంబంధించి ఐదుగురు మొత్తం 92 మందితో ప్యానల్ విడుదల చేసింది. పోస్టుల ఖాళీలను అనుసరించి సీనియారిటీ ప్రకారం వీరికి తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తారు.


