సుందరేశ్‌చారి ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

సుందరేశ్‌చారి ఎక్కడ?

Jul 28 2026 1:42 AM | Updated on Jul 28 2026 1:42 AM

మడకశిర: నకిలీ బంగారు నగలు తాకట్టుపెట్టి బ్యాంకుకు టోకరా వేసిన కెనరా బ్యాంక్‌ గోల్డ్‌ అప్రైజర్‌ సుందరేశ్‌చారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మడకశిర రూరల్‌ సర్కిల్‌ సీఐ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ కృష్ణారెడ్డి తదితరులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ సతీష్‌కుమార్‌ కూడా ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిసింది.

స్వగ్రామం, బంధువుల ఇళ్ల వద్ద ఆరా..

మడకశిర కెనరా బ్యాంకులో ఈనెల 25న తేదీ (శనివారం) ఆడిట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలించగా, 12 ఖాతాలకు సంబంధించిన ఆభరణాలు నకిలీవని గుర్తించారు. అంతేకాకుండా నకిలీ బంగారు ఆభరణాలతో ఏకంగా రూ.70.66 లక్షలు రుణాలు తీసుకున్నట్లు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై అనంతపురం కెనరా బ్యాంక్‌ ఏజీఎం శ్రీనివాసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా..బ్యాంక్‌ అప్రైజర్‌ సుందరేశ్‌చారితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు సుందరేశ్‌చారిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుందరేశ్‌చారి స్వగ్రామమైన గుడిబండ మండలం ఎస్‌ రాయాపురంతో పాటు అతని బంధువుల గ్రామాల్లోనూ పోలీసులు ఆరా తీశారు. కుటుంబ సభ్యులనూ విచారించారు. అంతేకాకుండా నిందితుడు హిందూపురం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా సుందరేశ్‌చారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

బ్యాంకు సిబ్బంది పాత్రపైనా ఆరా..

నకిలీ బంగారు బాగోతంలో గోల్డ్‌ అప్రైజర్‌ సుందరేశ్‌చారికి బ్యాంకు సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గోల్డ్‌ లోన్లు మంజూరు చేసిన సమయంలో ఉన్న బ్యాంకు సిబ్బంది తీరు గురించి ఆరా తీస్తున్నారు. మొత్తంగా సుందరేశ్‌చారి పట్టుబడితే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ కేసును ఒక కొలిక్కి తెస్తామని తెలిపారు.

నకిలీ బంగారు ఆభరణాల తాకట్టు కేసు దర్యాప్తు ముమ్మరం

కీలక నిందితుడైన సుందరేశ్‌చారి కోసం పోలీసుల గాలింపు

ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా

పట్టుకోవడానికి ప్రయత్నాలు

బ్యాంకు సిబ్బంది పాత్రపైనా

ఆరా తీస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement