ధర్మవరం రూరల్: ఓ ఇంట్లో దూరి బియ్యం బస్తాలు చోరీ చేసి వాటిని ద్విచక్రవాహనంపై తరలిస్తున్న దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మండల పరిధిలోని కుణుతూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... రావులచెరువు గ్రామానికి చెందిన బోయ అక్కులప్ప, కురుబ చంద్ర సోమవారం సాయంత్రం కుణుతూరు గ్రామంలోని చిన్నన్న గారి నారాయణరెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఉన్న నారాయణరెడ్డి కూతురు జ్వోతికారెడ్డిని నాన్నగారులేరా అని ప్రశ్నించారు. అందుకు ఆ అమ్మాయి లేరని చెప్పగానే... ‘‘మీ నాన్న మా ఇంట్లోని రెండు బియ్యం ప్యాకెట్లు తీసుకోండి’’ అని మాతో చెప్పాడంటూ ఇంట్లోకి దూరారు. దీంతో అనుమానం వచ్చిన జ్వోతికారెడ్డి గట్టిగా నిలదీయడంతో వారు ఆమె గొంతు పట్టుకొని ‘‘అరిస్తే చంపేస్తాం జాగ్రత్త’’ అంటూ బెదిరించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి రెండు బియ్యం బస్తాలను ఎత్తుకొని ఇంటి బయట అప్పటికే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపైకి వేశారు. సరిగ్గా ఆ సమయంలోనే జ్వోతికారెడ్డి గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి ధర్మవరం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
దొంగలకు దేహశుద్ధి చేసిన
కుణుతూరు వాసులు


