ధర్మవరం అర్బన్: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయమని కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌లు తెలిపారు. శుక్రవారం వారు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో ‘‘ఒక నెల– ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇన్‌చార్జ్ ఆర్డీఓ సువర్ణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 72 అర్జీలు అందాయి. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరాం, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, తహసీల్దార్ దేవరాజ్, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
● బత్తలపల్లి మండలం ముష్టూరు గ్రామానికి చెందిన రైతులు పార్వతమ్మ, కృష్ణమూర్తి, తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు చెందిన భూములకు ఎన్‌ఓసీ మంజూరు కాగా, డీపట్టా పేరుతో ఉన్న ఆయా భూములను ‘పట్టా’గా సవరణ చేసి క్రయవిక్రయాలు జరుపుకునే వెసులుబాటు కల్పించారు.
● ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామానికి చెందిన అంబటి హరినాథ్‌గుప్తాతోపాటు మరో 124 మంది సర్వే నంబర్ 905–ఏలోని 3.28 ఎకరాల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోగా, ఆ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు.
విద్యాసామగ్రి అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యాసామగ్రి అందించాలని పీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు విన్నవించారు. ఈ మేరకు ‘‘ఒక నెల– ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’’ కార్యక్రమంలో కలెక్టర్‌కు అర్జీ అందించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కలు, బూట్లతో కూడిన కిట్లు పూర్తిగా అందించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నీచర్, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


