ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. కచ్చితంగా ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.
‘సర్’ను సద్వినియోగం చేసుకోండి
ప్రశాంతినిలయం: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నిర్వహిస్తున్న ‘సర్’ కార్యక్రమాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. సోమవారం (నేడు) నుంచి బీఎల్‌ఓలు జూలై 14 వరకూ ఇంటింటినీ సందర్శిస్తారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల న్నారు. నకిలీ, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.
27 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ జిల్లాలోని 27 మండలాల్లో 480.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా బత్తలపల్లి మండలంలో 70.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, ధర్మవరం మండలంలో 54.2 మి.మీ, కనగానపల్లి 48.4, కొత్తచెరువు 33.4, బుక్కపట్నం 25.4, హిందూపురం 23.4, పుట్టపర్తి 22.6, నల్లమాడ 21.6, తాడిమర్రి 21.4, ముదిగుబ్బ 18.6, చిలమత్తూరు 18.4, పరిగి 15.4, గోరంట్ల 14.4, సీకేపల్లి 13.2, సోమందేపల్లి 11.4, లేపాక్షి 10.8, రొద్దం 9.6, పెనుకొండ 9.4, ఎన్‌పీ కుంట 7.2, రామగిరి 6.2, అమడగూరు 5.6, ఓడీచెరువు 5.2, మడకశిర 3.6, అమరాపురం 3.2, అగళి 2.6, నల్లచెరువు 2.2, గాండ్లపెంట మండలంలో 2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
టీబీ డ్యాంకు
329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి ఆదివారం 329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. టీబీ డ్యాంలో మొత్తం 9,910 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం ఎగువన ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో తొలిసారిగా ఆదివారం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి టీబీ డ్యాంలో 6,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండి, జలాశయంలో 26.140 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో హెచ్చెల్సీకి నీరు విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం జలాశయంలో 1,588.61 అడుగల వద్ద 9.910 టీఎంసీల నీరు నిల్వతో 329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 180 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1603.33 అడుగుల నీటి మట్టంతో 26.410 టీఎంసీల నీరు నిల్వ ఉండి, 6,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 128 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండేందని బోర్డు అధికారులు తెలిపారు.


