మళ్లీ తెరుచుకున్న అక్రమాల ‘కాటా’ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరుచుకున్న అక్రమాల ‘కాటా’

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

కళ్యాణదుర్గం రూరల్‌: తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ రైతులను మోసం చేసిన మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తి .. నెల తిరక్కుండానే మళ్లీ దుకాణం తెరిచేశాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వ్యాపారి రామ్మూర్తి కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అక్కమ్మగార్ల దేవాలయం ఎదుట మొక్కజొన్న వ్యాపారంతో పాటు వేబ్రిడ్జి (కాటా)ను నిర్వహిస్తున్నాడు. 20 రోజుల క్రితం సమీప గూబనపల్లికి చెందిన రైతుల చీనీ పంటను కాటాకు తరలించగా తూకాల్లో తేడారావడంతో వేబ్రిడ్జి నిర్వాహకుడిని నిలదీసి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిర్వాహకుడిపై నామమాత్రపు కేసు నమోదు చేసి నిమిషాల వ్యవధిలో స్టేషన్‌ నుంచి బయటకు పంపారు. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీగా ముడుపులు ముట్టాయన్న విమర్శలున్నాయి.

వ్యాపారిపై అనేక ఆరోపణలు...

● మూడు నెలల క్రితం చాపిరి గ్రామానికి చెందిన రైతు తన మొక్కజొన్న పంటను అమ్మేందుకు కాటాకు వచ్చాడు. అయితే తూకాల్లో తేడా రావడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది నిముషాల్లో నామమాత్రం కేసుతో రామ్మూర్తి బయట పడ్డాడు.

● రెండు నెలల క్రితం మల్లికార్జునపల్లికి చెందిన రైతు వేరుశనగ పంటను అమ్మడం కోసం వ్యాపారి వద్దకు వచ్చాడు. తూకాల్లో తేడా రావడంతో ఆగ్రహించిన రైతు వ్యాపారిని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

● మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్టకు చెందిన రైతు మొక్కజొన్న పంట అమ్మకం విషయంలో తూకాల్లో మోసం జరగడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులే దగ్గరుండి పంచాయితీ చేశారన్న ఆరోపణలున్నాయి.

చక్రం తిప్పిన వ్యాపారి రామ్మూర్తి

పోలీసులకు మామూళ్లిచ్చి వ్యాపారం ?!

సామాన్య ప్రజలకు ఏదైనా సమస్య వస్తే గంటైనా ఘటనా స్థలానికి రాని పోలీసులు.. మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తికి చిన్నపాటి సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో పరిష్కరిస్తారన్న విమర్శలున్నాయి. ఎంతోమంది రామ్మూర్తిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వివాదం జరిగి నెలగడవకనే రామ్మూర్తి మళ్లీ కాటాను తెరవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తూకాల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఏ ఒక్కరూ నష్టపోకుండా వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కాటా తెరవడంపై పట్టణ సీఐ హరినాథ్‌ని ‘సాక్షి’ వివరణకోరగా ఆయన స్పందించలేదు.

పోలీసుల అండ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement