కదిరి: వైఎస్ జగన్ హయాంలో ‘వైఎస్సార్ పశు బీమా’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. ఏదైనా కారణంతో పాడి పశువులు లేదంటే జీవాలు (గొర్రెలు, మేకలు) మృత్యువాత పడితే వెంటనే సదరు రైతు ఖాతాలో బీమా సొమ్ము జమ చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం గత ఏడాది కొద్ది రోజులు మాత్రమే జిల్లాలో పశువులకు బీమా కట్టించుకున్నారు. కానీ తర్వాత నిధులు లేవంటూ పశుబీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇటీవల గాలివాన, విద్యుదాఘాతం, కుక్కల దాడులు..ఇలా పలు కారణాలతో ఎన్నో జీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో పశుపోషకులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అయినా ఈ ప్రభుత్వం సదరు రైతులను ఆదుకున్న పాపాన పోలేదు.
జగన్ హయాంలో ఒక్కో రైతుకు రూ.3 లక్షలు
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏదైనా కారణంతో గొర్రెలు, మేకలు చనిపోతే ఒక్కోదానికి రూ.6 వేల చొప్పున గరిష్టంగా రూ.3 లక్షలు మంజూరు చేసేవారు. ఆ మొత్తాన్ని కూడా సదరు రైతు ఖాతాలో నేరుగా జమ చేసేవారు. ఆవు లేదా గేదెలు ప్రమాదవశాత్తూ చనిపోతే జగన్ ప్రభుత్వం ఒక్కోదానికి రూ.30 వేల చొప్పున రైతుకు నష్టపరిహారం ఇచ్చింది. రైతుకు భారం లేకుండా ప్రీమియం డబ్బులో కూడా 80 శాతం ప్రభుత్వమే భరించేది. కానీ ఇప్పుడు నిధులు లేవని ఆ పథకాన్ని నిలిపివేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
గడచిన ఐదు నెలల్లో 450 గొర్రెలు మృతి..
2026 జనవరి నుంచి మే 20వ తేదీ వరకు జిల్లాలో 452 గొర్రెలు, 311 మేకలు, 28 గేదెలు, 36 ఆవులు, 12 ఎద్దులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. వీటికి పశుబీమా లేకపోవడంతో పశుపోషకులు భారీగా నష్టపోయారు.
పాడిపశువులపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విస్మరించింది. గతంలో అమలు చేసిన పశువుల బీమా పథకానికి మంగళం పాడింది. ఫలితంగా ఏదైనా అనుకోని ప్రమాదంలో పశువులు, జీవాలు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పశు బీమాకు చంద్రన్న మంగళం
నిధులు లేవంటూ దారుణ మోసం
ఇటీవల తరచుగా మృత్యువాత
పడుతున్న మూగజీవాలు
పెద్ద మొత్తంలో నష్టపోతున్న
పశుపోషకులు
గత ప్రభుత్వంలో ‘వైఎస్సార్
పశు బీమా’తో ఎంతో లబ్ధి
ఈనెల 26వ తేదీన తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో ఈదురుగాలులు వీచి కుళ్లాయప్పకు చెందిన పశువుల షెడ్డు కూలి ఐదు గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. అలాగే రూ.లక్షకుపైగా విలువ చేసే పాడిగేదె మృతి చెందింది.
వారం క్రితం తలుపుల మండలం దేవరపల్లిలో గాలివానకు కరెంటు తీగలు తగిలి మల్లినాయుడుకు చెందిన రూ.లక్ష విలువ చేసే ఎద్దులు మృతి చెందాయి.
గత నెలలో కదిరి మండలం మీటేనాయక్ తండాలో పొలం వద్ద యూరియా కలిపిన నీళ్లు తాగి బద్దే నాయక్‌కు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి.
ఇటీవల రొద్దం మండలం ఎం.కొత్తపల్లి ఎస్సీ కాలనీలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో నాగన్నకు చెందిన 22 గొర్రెలు మృతి చెందాయి.
నెల రోజుల క్రితం ఎన్‌పీకుంట మండలం భీమబోయినపల్లిలో కుక్కల దాడిలో కొమ్మల సురేష్ అనే రైతుకు చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి.
15 రోజుల క్రితం సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామంలో ఉప్పర గోపాల్‌కు చెందిన 20 గొర్రెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి.
ఇటీవల జరిగిన సంఘటనలు కొన్ని...


