దోచుకునేందుకే అమరావతి మంత్రం | - | Sakshi
Sakshi News home page

దోచుకునేందుకే అమరావతి మంత్రం

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

పెనుకొండ రూరల్‌: ‘‘చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్టదు. అందుకే గతంలో వైఎస్‌ జగనన్న అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేసి పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. పైగా ప్రతి మంగళవారం ఆర్‌బీఐ వద్దకు అప్పులకు వెళ్తున్నారు. అమరావతి పేరు చెప్పి రూ.లక్షల కోట్లు దండుకుంటున్నారు. అనుచరులకు, బినామీలకు దోచిపెడుతున్నారు. అమరావతిలో నాలుగు రోడ్లకు చేసే ఖర్చును, మెడికల్‌ కాలేజీల కోసం వెచ్చించి ఉంటే రాష్ట్రంలోని పేద, మద్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేది. ఇది ప్రజా కంఠక ప్రభుత్వం.’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో సోమందేపల్లి మండల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మూడుసార్లు మహానాడు అంటూ అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించారని, కానీ ఏ మహానాడులోనూ బీసీల సంక్షేమం గురించి ఆయన మాట్లాడలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు పింఛన్‌, కురుబల్లోని గుడికట్టు పూజార్లకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చి...ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. అసలు ఈ ప్రభుత్వం బీసీలకోసం ఏం చేసిందో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత సమాధానం చెప్పాలన్నారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా వైఎస్‌ జగనన్న ప్రభుత్వం ఎందరో నిరుపేద చేనేతలను ఆర్థికంగా ఆదుకుందన్నారు. అందువల్లే వైఎస్సార్‌ సీపీ హయాంలో చేనేతలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం నేతన్నలకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక పోతోందన్నారు. సొంత మగ్గాలున్న యజమానులకు మాత్రమే పథకం వర్తింపజేస్తోందన్నారు. యజమాని దగ్గర మగ్గం నేసే నేతన్నలకు పథకం ఎందుకు వర్తింపజేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

విజయ్‌తో నీకు పోలికా..?

పార్టీ స్థాపించి...ఎవరితోనూ పెత్తుపెట్టుకోకుండా ఎన్నికల్లో నిలిచి...ప్రజాభిమానంతో గెలిచి సీఎం అయిన విజయ్‌తో పోలిక పెట్టుకోవద్దని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఉషశ్రీచరణ్‌ హితవు పలికారు. తమిళనాడు సీఎం కమిట్మెంట్‌ ఉన్న నాయకుడన్నారు. బీజేపీ పొత్తుకు ఆహ్వానించినా..ఆయన ఒప్పుకోలేదన్నారు. ప్రజల కోసమే పార్టీ పెట్టాడనీ, ప్రజలకు కూడా ఆయన్ను నమ్మి ఆ పార్టీని గెలిపించారన్నారు. పొత్తులతో రాజకీయం చేసే పవన్‌కళ్యాణ్‌కు విజయ్‌కి చాలా తేడా ఉందన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం..

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వైఎస్సార్‌ సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మరోసారి నోరు జారితే సహించబోమని ఉషశ్రీచరణ్‌ హెచ్చరించారు. మంత్రిగా ఉన్న ఆమె.. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని, ఇందుకు సంబంధించిన చర్చకు వైఎస్సార్‌ సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సవిత...వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చింది మంచి చేయడానికి గానీ, కక్షలు రేపటానికి, తప్పుడు కేసులు పెట్టడానికి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌, నాయకులు మంజు, వేణుగోపాల్‌, హనుమంతు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన

చంద్రబాబు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉష శ్రీ చరణ్‌

Advertisement
 
Advertisement
Advertisement