లేపాక్షి: లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్‌కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ వచ్చారు. ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు. అయితే ఆయనకు అసౌకర్యం కలిగించారంటూ వారిని స్థానిక పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము కటిక పేదరికం కారణంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నామని, తమను ఇలా స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. వృద్ధాప్యంలో ఆదుకునే వారు లేక భిక్షాటన చేసి పొట్ట నింపుకుంటున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడం సరికాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఎస్‌ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. ఇందులో వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు.
డీఎస్పీకి అసౌకర్యం
కల్గించారంటూ ఖాకీల చర్యలు
వృద్ధ మహిళలను గంటల తరబడి స్టేషన్‌లో ఉంచడంపై సర్వత్రా విమర్శలు


