గుడిబండ: ‘మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలి. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. మహిళలు అనేక వ్యాపారాలు చేయడం.. లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉంది’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం మండల పరిధలోని కరెకెర గ్రామంలో పర్యటించి పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, కొర్రమీను చేపల పెంపకం కేంద్రాన్ని, పాల డెయిరీ, ఆక్వా యూనిట్‌ను సందర్శించారు. అనంతరం జిల్లాలోనే తొలిసారిగా కరికెర గ్రామంలో ‘భర్తన్ బ్యాంక్’ను (స్టీల్ సామాన్ల బ్యాంక్) ప్రారంభించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కరికెర గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోనే మొదటి సారిగా కరికెర గ్రామంలో భర్తన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. కరికెర గ్రామంలో మహిళల ఐక్యత, పనితీరు జిల్లాకే ఆదర్శమన్నారు. తర్వాత కరికెర గ్రామానికి చెందిన పాల డెయిరీ నిర్వహిస్తున్న లక్ష్మమ్మ ముచ్చటించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత, అదనపు సీఈఓ వెంటసుబ్బారెడ్డి, ఎంపీడీఓ కేశవరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీకి నోటీసులు
పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డీఆర్‌డీఏ పీడీ నరసయ్యకు నోటీసులు జారీ చేశారు. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన వి.గంగాధర్ ఓ విషయమై 2024 అక్టోబర్ 21న సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినందుకు పీడీకి మంగళవారం నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 16న వర్చువల్‌గా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి
పుట్టపర్తి అర్బన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉందాం.. ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దామని డీఎంహెచ్‌ఓ ఫైరోజబేగం పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఆహారపు అలవాట్లు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ నాగేంద్రనాయక్, డీఈఎంఓ సుబ్రహ్మణ్యం, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, ఏపీ ఎన్‌జీఓ అసోషియేషన్ నాగేంద్ర, బాబా ఫకృద్దీన్, డిప్యూటీ హెచ్‌ఈఓ రామలక్ష్మి, ఏఎంఓ లక్ష్మీనాయక్ శివరాం, దేవేంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు.


